ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. వాతావరణశాఖ హెచ్చరిక..

- May 07, 2019 , by Maagulf
ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. వాతావరణశాఖ హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వడగాలుల తీవ్రతకు జనం బెంబేలు ఎత్తుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఎండలకు జనం పిట్టలా రాలిపోతున్నారు. ఉక్కపోత, వడదెబ్బలకు మృత్యువాతపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . ఏపీలో ఇప్పటివరకు వడదెబ్బకు 17 మంది మృతి చెందారు. సోమవారం ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో నలుగురు వడగాల్పులకు బలయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు

మరికొద్ది రోజులు సూర్యుడు మరింత మండిపోతాడని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున గాలిలో తేమశాతం తగ్గింది. దీంతో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరుగుతున్నాయి. ప్రజలు మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు. సాధారణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయింది.

మరి కొద్దిరోజుల పాటు 45 నుంచి 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ‌ధ్యాహ్నం 12 గంటల‌కే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు 46.22 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. 379 మండ‌లాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆరు జిల్లాల్లో ఎండ‌లు మండుతున్నాయి. తూర్పు గోదావరి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఎండ‌ల్లో తిర‌గ‌కుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com