భారత ప్రభుత్వం కు సహకరించే దిశగా స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం

- May 27, 2019 , by Maagulf
భారత ప్రభుత్వం కు సహకరించే దిశగా స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం

దిల్లీ/బెర్న్‌: విదేశాలకు నల్లధనాన్ని తరలించే వారిపై భారత ప్రభుత్వం తీసుకొనే చర్యలకు సహకరించే దిశగా స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం కొన్ని అడుగులు ముందుకు వేసింది. ఈ క్రమంలో తమ దేశంలోని వివిధ బ్యాంకుల్లో రహస్య ఖాతాలు కలిగిన 11 మంది భారతీయులకు ఈనెల 21న తాఖీదులను జారీ చేసింది. భారత ప్రభుత్వంతో వారి వివరాలను పంచుకోవటానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా కోరుతూ, ఈ దిశగా ఓ అవకాశం కల్పించటం ఈ నోటీసుల ఉద్దేశం. తాము ఎవరెవరికి తాఖీదులు పంపించామో గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రకటించినప్పటికీ ఖాతాదారుల పేర్లను రహస్యంగా ఉంచేందుకు సంక్షిప్తీకరించింది. వారి జాతీయత, పుట్టిన తేదీలను అందులో పేర్కొంది. ఇద్దరు భారతీయుల పేర్లను మాత్రమే పూర్తిగా పేర్కొంది. వారు కృష్ణభగవాన్‌ రామ్‌చంద్‌(పుట్టిన తేదీ 1949 మే), కల్పేశ్‌ హర్షద్‌ కినరివాలా(పుట్టిన తేదీ 1972 సెప్టెంబరు). అంతకు మించి వివరాలను ఏ ఇతర వివరాలను ఆ అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.

మిగిలిన వారి పేర్లు పొడి ఆంగ్ల అక్షరాల్లో ఉన్నాయి. అవి.. ఎస్‌.బి.కె (పుట్టిన తేదీ 1944, నవంబరు 24), ఎ.బి.కె.ఐ(పుట్టిన తేదీ 1944, జులై 9), పి.ఎ.ఎస్‌(పుట్టిన తేదీ 1983, నవంబరు 2), ఆర్‌.ఎ.ఎస్‌ (పుట్టిన తేదీ 1973 నవంబరు 22), ఎ.పి.ఎస్‌. (పుట్టిన తేదీ 1944 నవంబరు 27), ఎ.డి.ఎస్‌ (పుట్టిన తేదీ 1949, ఆగస్టు 14), ఎం.ఎల్‌.ఎ (పుట్టిన తేదీ 1935 మే 20), ఎన్‌.ఎం.ఎ (1968 ఫిబ్రవరి 21), ఎం.ఎం.ఎ (1973 జూన్‌ 27). వెల్లడించిన ఖాతాదారుల్లో పురుషులు, మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో పేర్కొన్న వ్యక్తులు లేదా వారి ప్రతినిధులు 30 రోజుల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలని, భారత ప్రభుత్వానికి తమ పేర్లను, ఆర్థిక వివరాలను ఎందుకు వెల్లడించరాదో తెలపాలని తాఖీదుల్లో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ పన్నుల విభాగం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com