తమిళనాడులోని తెలుగు విద్యార్థులకు మాతృభాష కష్టాలు..
- January 04, 2016
తమిళనాడులోని తెలుగు విద్యార్థులకు మాతృభాషా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. పదో తరగతి వరకు మాతృభాషలో విద్యాభ్యాసం చేసినా.. టెన్త్ పరీక్షలు మాత్రం తమిళంలోనే రాయాల్సిందేనంటూ తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి. సబిత పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కాపీ ప్రతులు కూడా ఆయా పాఠశాలలకు పంపించారు. ఆ లేఖల్లో సదరు విద్యార్థులు ఖచ్చితంగా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిందేనని సబిత స్పష్టం చేశారు. స్థానిక విల్లివాక్కంలోని ఎస్‌కేడీటీ హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థికి వచ్చిన లేఖ సారాంశంలోకి వెళితే... 'ఈ విద్యా సంవత్సరంలో ఎస్‌కేడీటీ హైయ్యర్ సెకండరీ స్కూలులో నిర్బంధ తమిళ విద్యాబోధన అంచెలంచెలుగా అమలుచేస్తూ, తమిళ పాఠ్యపుస్తకాలు సైతం పంపిణీ చేసిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను తెలుగులో రాయడానికి అనుమతించే ప్రసక్తే లేదు తమిళ భాషాధ్యయన చట్టం 2006లో పేర్కొన్న విధివిధానాల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న స్వయంప్రతిపత్తి ఉన్నత, మహోన్నత పాఠశాలల్లోను, మైనారిటీ భాషలైన తెలుగు, ఉర్దూ, కన్నడం, మలయాళం తదితర ఇతర భాషలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు పార్ట్-1లో తమిళభాషను ప్రాథమిక పాఠశాలల్లో 2006-07 విద్యా సంవత్సరంలోనే ఒకటో తరగతిలో ప్రవేశపెట్టడం జరిగింది. 2007-08 విద్యా సంవత్సరంలో 1, 2 తరగతులలోను, ఆ తర్వాత ప్రతియేటా అంచెలంచెలుగా తమిళభాషాధ్యయనం ప్రవేశపెట్టడం జరిగి, ఉన్నత, మహోన్నత పాఠశాలలకు సంబంధించి 6వ తరగతి విద్యార్థులకు 2011-12 విద్యాసంవత్సరంలోను, 6, 7 తరగతి విద్యార్థులకు 2012-13 విద్యా సంవత్సరంలోను, అదేవిధంగా ప్రతియేటా దశలవారీగా పార్ట్-1 కింద తమిళపాఠాలు బోధిస్తున్నాం. ప్రస్తుతం 2015-16 విద్యాసంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు (పార్ట్-1 తమిళంలో) పరీక్షలు రాయనున్నారు. ఈ విషయమై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారుల నుండి ఆయా సంవత్సరాలలో నోటీసులు జారీ చేయడంతోపాటు తమిళమాధ్యమంలో బోధనను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషనను హైకోర్టు ప్రథమ ధర్మాసనం 23.08.2007న తోసిపుచ్చింది. ఆ తర్వాత పిటీషనర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ 2008 జూలై 14న తోసివేతకు గురైంది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి ఒకటి నుండి నిర్బంధ తమిళం అమలు జరుగుతోంది. పార్ట్-2లో ఆంగ్లాన్ని, పార్ట్-3లో గణితం, సైన్స్, సామాజికశాస్త్రం తదితర పాఠ్యాంశాలను మైనారిటీ భాషలలో చదివేలా విధివిధానాలు రూపొందించడం జరిగింది. ప్రస్తుతం 2015-16 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పార్ట్-1లో తమిళమాధ్యమంలో పరీక్షలు రాయటం నుండి మినహాయింపు (వెసులుబాటు) కల్పించాలని సెక్షన 5 మేరకు గణేశ పంపిన దరఖాస్తును మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఏస్‌కేడిటీ ఉన్నత పాఠశాలలో పార్ట్-1లో తమిళపాఠం నేర్చుకునేందుకు వీలుగా ప్రతియేటా తమిళ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయటం జరిగింది. సదరు పాఠశాలలో తమిళపాఠాలను బోధించేందుకు పట్టభద్రులైన ఉపాధ్యాయులును నియమించి, పాఠాలను బోధించటమూ జరిగింది. పార్ట్-1లో తమిళమాధ్యమంలో పరీక్షలు కూడా జరిపి, సమాధానపత్రాల మూల్యాంకనాలు జరిగి, పరీక్ష ఫలితాలను సైతం ఆ పాఠశాలకు సమర్పించటం జరిగింది. పైగా సదరు పాఠశాల విద్యార్థులు గత సెప్టెంబర్‌లో త్రైమాసిక పరీక్షలను సైతం పార్ట్-1గా తమిళంలోనే పరీక్షలు రాశారు. ఆ త్రైమాసిక పరీక్ష ఫలితాల నివేదికను కూడా ఆ పాఠశాలకు పంపించాం. తమిళభాషాధ్యయన చట్టం 2006 ప్రకారం, 2011-12లో 6వ తరగతిలో పార్ట్-1లో తమిళపాఠం ప్రవేశపెట్టిన సంవత్సరంలోనే సదరు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సరైన పద్ధతిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తమిళంలో పరీక్షలు రాయటం నుండి మినహాయంపు కోరుతూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసికొని ఉండాల్సింది. అలాచేయకుండా తమిళభాషాధ్యయన చట్టం 2006 ప్రకారం 2011-12లో 6వ తరగతి నుండి పార్ట్-1 తమిళపాఠం ప్రవేశపెట్టడంతో ఇప్పటిదాకా ఆ భాషలో అధ్యయనం చేస్తున్న విద్యార్థులు 2015-16 విద్యాసంవత్సరంలో తమిళంలోనే 10వ తరగతి పరీక్షలు రాయనున్న తరుణంలో, అదీ చిట్టచివరి ఘట్టంలో తమిళంలో పరీక్షల రాయకుండా వెసలుబాటు కల్పించాలని కోరటం అసమంజసం. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తమిళభాషలో పరీక్షలను రాయడం నుండి మినహాయింపు కల్పించేందుకు ఆస్కారమే లేదు' అని సబిత పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









