ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్- సింధు, శ్రీకాంత్ శుబారంభం

- July 18, 2019 , by Maagulf
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్- సింధు, శ్రీకాంత్ శుబారంభం

ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు బుధవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు శుభారంభాలు చేయగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సాయిప్రణీత్‌లు తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో 8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ 21-14, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన కెంటా నిషిమో టోపై విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్‌ ప్రత్యర్థిపై విరుచుకుపడి వరుసగా పాయింట్లు చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు. శ్రీకాంత్‌ ధాటిని తట్టుకోలేక జపాన్‌ ప్రత్యర్థి తొలి గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయాడు. అనంతరం జరిగిన రెండో గేమ్‌లోనూ కిదాంబి చెలరేగి ఆడాడు. మొదటి నుంచే నిషిమోటోపై ఆధిపత్యం చెలాయిస్తూ పోయాడు. మధ్యలో పుంజుకున్న జపాన్‌ ఆటగాడు వరుసగా పాయింట్లు చేస్తూ మ్యాచ్‌లో కాస్తా ఆసక్తిని పెంచాడు. కానీ మళ్లి జోరు అందుకున్న ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ వేగంగా ఆడుతూ వరుస స్మాశ్‌లతో ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. చివరికి భారీ ఆధిక్యంలో దూసుకెళ్లిన శ్రీకాంత్‌ 21-13తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. ఏకపక్షంగా విజయం సాధించిన శ్రీకాంత్‌ ఈ మ్యాచ్‌ను కేవలం 38 నిమిషాల్లోనే ముగించి సత్తా చాటుకున్నాడు. ఇప్పటివరకు శ్రీకాంత్‌-నిషిమోటోలు ముఖాముఖిగా 6 సార్లు తలపడితే.. అందులో శ్రీకాంత్‌ 5 సార్లు గెలుపొందగా.. నిషిమోటో ఒక్కసారే నెగ్గాడు.
తొలి రౌండ్‌లోనే.. 
మరోవైపు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, బి సాయి ప్రణీత్‌లు తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో స్విస్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ సాయి ప్రణీత్‌ 15-21, 21-13, 10-21 తేడాతో హాంగ్‌కాంగ్‌కు చెందిన వాంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌ చేతిలో
ఓట మిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-19, 18-21, 20-22 తేడాతో చైనా స్టార్‌, రెండో సీడ్‌ షి యూకి చేతిలో పోరాడి ఓడాడు. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో తొలి గేమ్‌ను గెలుచుకున్న ప్రణయ్‌ తర్వాతి గేమ్‌లలో చెమటోడ్చినా ఆఖరికి చైనా ప్రత్యర్థికే విజయం వరించింది.
సింధు అలవోకగా.. 
భారత స్టార్‌ షట్లర్‌, ఐదో సీడ్‌ పీవీ సింధు అలవోకగా రెండో రౌండ్‌లో దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 11-21, 21-15, 21-15 తేడాతో జపాన్‌ ప్లేయర్‌ ఆయా ఒహోరిపై విజయం సాధించింది. ఆరంభంలో తడబడిన సింధు తొలి గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయింది. ఆ వెంటనే తేరుకున్న సింధు ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగి జోరును ప్రదర్శించింది. ఈ క్రమంలోనే సింధు 21-15తో రెండో గేమ్‌ను గెలుచుకొని ప్రత్యర్థి ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది. అనంతరం అదే జోరును ప్రదర్శించిన సింధు 21-15తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకొని తర్వాతి రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఇక గురువారం జరిగే రెండో రౌండ్‌లో సింధు డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడుతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంట సాత్విక్‌ సాయిరాజ్‌ రంకీరెడ్డి-అశ్విని పొన్నప్పలు 13-21, 11-21 తేడాతో ఇండోనేసియాకు చెందిన టొంటొవి అహ్మద్‌-విన్ని ఒక్తావినా ద్వయం చేతిలో ఓటమిపాలై ఇంటి ముఖం పట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com