విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్...

- July 18, 2019 , by Maagulf
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్...

న్యూఢిల్లీ : భారతదేశంలోని విమానయాన సంస్థలు విమాన ప్రయాణికులకు శుభవార్త వెల్లడించాయి. అమెరికా, యూరోప్ దేశాలకు విమాన చార్జీలు 15 నుంచి 20 శాతం తగ్గిస్తూ పలు విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 27వతేదీ నుంచి పాకిస్థాన్ తన గగనతలంపై విమానాల రాకపోకలను నిషేధించిన నేపథ్యంలో భారతదేశం నుంచి అమెరికా, యూరోప్ దేశాలకు రాకపోకలు సాగించే విమానాలు మరో మార్గంలో వెళ్లాల్సి వచ్చేంది. దీంతో అమెరికా, యూరోప్ దేశాలకు విమాన చార్జీలు గతంలో పెరిగాయి. పాకిస్థాన్ తన గగనతలంపై విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో అమెరికా, యూరోప్ దేశాలకు విమానమార్గ దూరం గణనీయంగా తగ్గింది. దీంతో అమెరికా, యూరోప్ దేశాలకు విమాన చార్జీలు 15 నుంచి 20 శాతం మేర తగ్గాయని యాత్ర ట్రావెల్ పోర్టల్ సీఓఓ శరత్ ధాల్ చెప్పారు. అలాగే గల్ఫ్ దేశాలకు విమానచార్జీలు 30 శాతం తగ్గాయి. ఢిల్లీ నుంచి అబుదాబీకి గతంలో 30వేల రూపాయలున్న విమాన టికెట్ ధర పాకిస్థాన్ గగనతలంపై విధించిన ఆంక్షల ఎత్తివేతతో 17వేలరూపాయలకు తగ్గింది. ఢిల్లీ నుంచి లండన్ నగరానికి విమాన చార్జీ రూ.80వేల నుంచి రూ.63వేలకు తగ్గింది.
విమాన చార్జీలు తగ్గడంతోపాటు విమాన ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. తక్కువ సమయంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. పాక్ ఆంక్షల ఎత్తివేత అనంతరం ఢిల్లీ -అమృతసర్- బిర్ మింగం ఎయిర్ ఇండియా సర్వీసును ఆగస్టు 15వతేదీ నుంచి ప్రారంభిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హెచ్ఎస్ పూరి వెల్లడించారు. ఢిల్లీ - ఇస్తాంబుల్ విమాన ప్రయాణ సమయం పదిన్నర గంటల నుంచి 7 గంటలకు తగ్గింది. ప్రాంక్ ఫర్ట్, మునిచ్, జురిచ్ నగరాలకు ఢిల్లీ నుంచి విమాన సర్వీసులు నడపనున్నారు. గతంలో రద్దు చేసిన ఢిల్లీ -టొరంటో విమాన సర్వీసును ఆగస్టు 1వతేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. మొత్తంమీద పాక్ తన గగనతలంపై విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షల ఎత్తివేత వల్ల విమాన ప్రయాణికులకు మేలు జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com