సైన్యం లో సేవలందించేందుకు రెండు నెలలు విరామం తీసుకోనున్న ధోని

- July 21, 2019 , by Maagulf
సైన్యం లో సేవలందించేందుకు రెండు నెలలు విరామం తీసుకోనున్న ధోని

వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు ఆడే సిరీస్‌ నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పారామిలటరీ రెజిమెంట్‌లో పని చేయాలని నిర్ణయించుకున్న ధోని ఆట నుంచి విరామం తీసుకున్నాడు. ఎనిమిదేళ్ల నుంచి అతడు పారాచూట్‌ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్ హోదాలో ఉన్నాడు.

రెండు నెలలు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు రోజుల క్రితమే బీసీసీఐ ఉన్నతాధికారిని ధోని వ్యక్తిగతంగా కలిసి సమాచారం ఇచ్చాడని తెలిసింది. వెస్టిండీస్ సిరీస్ కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని అతడు కోరినట్లు సమాచారం.

తాజాగా అదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లాడు. 
''వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం రెండు నెలల విరామం మాత్రమే. రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడి నిర్ణయాన్ని కెప్టెన్‌ కోహ్లి, సెలక్టర్లకు తెలియజేశాం'' అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. సైనిక విభాగంలో పనిచేయాలనే ధోని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com