యెమెన్‌లోని అడెన్‌లో భీకరపోరు...40 మంది మృతి

- August 12, 2019 , by Maagulf
యెమెన్‌లోని అడెన్‌లో భీకరపోరు...40 మంది మృతి

యెమెన్‌లోని అడెన్‌లో ప్రభుత్వ అనుకూల దళాలకు, వేర్పాటు వాదులకు మధ్య జరిగిన భీకరపోరులో కనీసం 40 మంది మరణించారని, మరో 260 మందికి పైగా గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ నుండి అడెన్‌ నగరంలో కొనసాగుతున్న పోరులో అనేక మంది పౌరులు ప్రాణాలుకోల్పోగా, పలువురు గాయాల పాలయ్యారని వివరించింది. ఇందుకు సంబంధించి తమకు అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ మూడు రోజుల్లో దాదాపు 40 మంది వరకూ మరణించారని, మరో 260 మంది గాయపడ్డారని ఐరాస తన ప్రకటనలో వివరించింది. శాంతి, సామరస్యాలు వెల్లివిరిసే ఈద్‌ఉల్‌ అధా పండుగ రోజు ఆత్మీయుల మరణానికి విచారాన్ని తెలియచేయాల్సి రావటం అత్యంత విచారకరమైన అంశమని యెమెన్‌లోని ఐరాస కార్యక్రమాల సమన్వయ కర్త లిసె గ్రాండె ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలను పంపటం తమ ముందున్న తక్షణ ప్రాధాన్యత అని ఆమె వివరించారు. పలువురు ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయి ఆహారం, నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు వెలువడుతున్న వార్తలు తమను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయని ఆమె చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com