సమన్వయంతో గణేష్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం–మేయర్ రామ్మోహన్

సమన్వయంతో గణేష్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం–మేయర్ రామ్మోహన్

గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషిచేయాలని వివిధ శాఖల అధికారులు నిర్ణయించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు జరిగిన గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్ లతో సహా అడిషనల్ సిపిలు, డిసిపిలు, ఏసిపిలు, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, విభాగ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 12వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని నిర్ణయించినందున ఈ కార్యక్రమాన్ని ఏవిధమైన పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కన్నా అదనపు ఏర్పాట్లను ఈ సారి చేపట్టాలని సూచించారు. జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ గణేష్ శోభయాత్ర జరిగే మార్గాలన్నింటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు ముందుగానే చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. శానిటేషన్ ను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక సిబ్బందిని, గణేష్ యాక్షన్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిహెచ్ఎంసితో పాటు హైదరాబాద్ మెట్రో రైలు, జాతీయ రహదారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు కూడా తమ పరిధిలోని రహదారులను మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధిక క్రేన్ లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 32 ప్రాంతాల్లో 894 క్రేన్ లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు స్టాటిక్ క్రేన్ లు, మొబైల్ క్రేన్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో 32 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయడంతో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిమజ్జన మార్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్వల్ప సమస్యలు కూడా తలెత్తకుండా భద్రతా పరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిమజ్జన రోజున హైదరాబాద్ మెట్రో రైలు, ఎం.ఎం.టి.ఎస్ రైళ్లను అదనంగా నిర్వహించాలని, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలలో రైల్వే ప్రొటక్షన్ పోర్స్ లను ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి 56 క్రేన్ లను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు. గత సంవత్సరం 122 మొబైల్ పోలీసు బృందాలు ఉండగా ఈ సారీ 236కు పెంచినట్టు తెలిపారు. నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో చెట్లను ప్రూనింగ్ చేయాలని కోరారు. 63 ప్రాంతాల్లో స్టాటిక్ జనరేటర్లను ఏర్పాటు చేయాలని, నిమజ్జనంలో పాల్గొనే ప్రతి వాహనం కండీషన్ ను ట్రాన్స్ పోర్ట్ అధికారులు ధృవీకరించాలని హైదరాబాద్ నగర అడిషనల్ సిపి చౌహాన్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో స్టేషన్ ల వంతెనల ఎత్తును దృష్టిలో ఉంచుకొని గణేష్ విగ్రహాల ఎత్తును నిర్థారించాలని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోని వివిధ సరస్సులో జరిగే నిమజ్జనానికి అదనపు ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా సరూర్ నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు దాసరి హరిచందన, ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, మమత, అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, పోలీసు ఉన్నతాధికారులు ఎల్లేష్ చౌహాన్, విజయ్ కుమార్ లతో పాటు రోడ్లు భవనాల శాఖ, హెచ్ఎండిఏ, ఆర్ అండ్ బి, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top