మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం

- August 18, 2019 , by Maagulf
మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం

కాంచీపురం అత్తివరదరాజస్వామి తిరిగి కోనేటిలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకే ఆయన భక్తులకు దర్శమిస్తారు. 48రోజుల్లో దాదాపు 2కోట్లమంది అత్తివరదర్‌ పెరుమాళ్‌ని దర్శించుకున్నారని అంచనా. కాంచీపురం అత్తి వరదరాజస్వామి మళ్లీ కోనేటి ప్రవేశం చేశారు. 48రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి... కోనేటి గర్భంలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకు బయటకు వస్తారు. ఈ 48 రోజుల్లో తొలి 38 రోజులు శయనస్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిచ్చారు అత్తివరదర్ పెరుమాళ్‌.

దక్షిణాపథంలోని ఏకైక మోక్షపురంగా ప్రసిద్దిగాంచిన కంచిలో ఉన్న వెయ్యికి పైగా ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. వరదరాజస్వామి విగ్రహాం అత్తిచెక్కతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు వెండి పెట్టెలో పెట్టి ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన అడుగుభాగంలో భద్రపరిచారని పెద్దలు చెబుతారు.

పరిస్థితులు చక్కబడ్డాక పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహ ఆనవాళ్లు తెలియకపోవడంతో.. గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. మూలవిరాట్ లేకపోవడంతో వేరే విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. కొన్నాళ్ల తర్వాత కోనేరు ఎండిపోవడంతో వెండి పెట్టెలోని ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కచెదరకపోవడంతో దానిని తిరిగి ప్రతిష్టించారు. 48 రోజులపాటు క్రతువులు నిర్వహించి మళ్లీ కోనేటిలో భద్రపరిచారు. కాలానుగుణంగా ఇదే సంప్రదాయంగా మారింది. అప్పటినుంచి కోనేరులో భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకోసారి తీసి 48 రోజులపాటు పూజలు చేసి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు. 1854 నుంచి ఇలా చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్ట్ 17 వరకూ ఈ మహాక్రతువు నిర్వహించారు.

జూలై 1 నుంచి సుమారు రెండు కోట్లమంది భక్తులు అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెరుమాళ్‌ సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ప్రధాని దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సూపర్‌స్టార్ రజనీకాంత్‌ దంపతులు, నటి నయనతార తదితరులు అత్తివరదరాజ్‌ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com