అక్టోబర్ వరకే గడువు.. నిషేధం తప్పదు..

- September 04, 2019 , by Maagulf
అక్టోబర్ వరకే గడువు.. నిషేధం తప్పదు..

అంతర్జాతీయంగా ఎదురుదెబ్బలు, భారత ప్రభుత్వం ఎత్తుగడలతో దాయాది దేశం వెనుకడుగు వేస్తోంది. ఇన్నాళ్లు యుద్ధం అంటూ రెచ్చిపోయిన పాక్‌ ప్రభుత్వం, ఒక్కసారిగా మాట మార్చింది. అణ్వస్త్రాలున్నాయంటూ అడ్డగోలుగా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు మళ్లీ చర్చల రాగం అందుకున్నారు.

భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ మొన్నటి వరకు బీరాలు పోయిన ఇమ్రాన్, ఇప్పుడేమో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పుకొచ్చారు. పైగా, పాకిస్థాన్‌ ఎన్నటికీ యుద్ధం ప్రారంభించబోదంటూ కొత్త పాట పాడారు. అణ్వస్త్రాలను ప్రయోగించబోమని చెప్పారు. యుద్ధంలో ఓడిన దేశంతో పాటు గెలిచిన దేశం కూడా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందన్నారు.

గతవారం వరకు ఇమ్రాన్‌ఖాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కశ్మీర్ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఐక్యరాజ్యసమితిలో స్వయంగా తానే మాట్లాడతానంటూ గొప్పలు పోయారు. కానీ, అంతర్జాతీయంగా మద్ధతు రాకపోవడం తో అసలు విషయం బోధపడింది. పైగా, FATF నిషేధ కత్తి మెడపై వేలాడుతుండడంతో ఇమ్రాన్ స్వరం లో మార్పు వచ్చింది. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇమ్రాన్ సర్కారుకు అక్టోబర్ వరకే గడువు ఉంది. ఆలోపు సరిగా వ్యవహరించకపోతే నిషేధం తప్పదు. అదే జరిగితే పాకిస్థాన్‌కు పైసా అప్పు పుట్టదు. ఇది దృష్టిలో పెట్టుకొనే ఇమ్రాన్ ఖాన్, కాళ్లబేరానికి వస్తున్నట్లు సమాచారం.

పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహ్మద్ ఖురేషీ కూడా చర్చల పాటే పాడుతున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే, వివాదాలకు తెరపడుతుందని ఖురేషీ పేర్కొన్నారు.

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లినా ప్రయోజనం ఉండబోదని పాకిస్థాన్‌కు తెలిసి వచ్చింది. స్వయంగా పాక్ ఐసీజే న్యాయవాది ఖవార్ ఖురేషీ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లారు. జమ్మూకశ్మీర్‌లో మారణహోమం జరుగుతోందనే ఆరోపణలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వద్ద సరైన సాక్ష్యాలు లేవని ఖవార్ ఖురేషీ పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఐసీజేలో కేసు గెలవడం సాధ్యం కాదన్నారు. ఖవార్ ఖురేషీ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com