తెలంగాణ క్యాబినెట్ విస్తరణ: కేటీఆర్, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలకు చోటు

- September 08, 2019 , by Maagulf
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ: కేటీఆర్, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలకు చోటు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మరికొన్ని గంటల్లో రాజ్‌భవన్‌లో జరుగనుంది. గవర్నర్‌గా ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్ క్యాబినెట్‌లో చేరనున్న మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మంత్రివర్గం లేకుండానే పాలన సాగింది.

తొలివిడత మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మందికి అవకాశం ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి వారికి చోటు లభించలేదు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో వీరు మంత్రి పదవులు నిర్వహించడం, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

తాజాగా జరుగుతున్న మంత్రివర్గ రెండో విస్తరణలో కేటీఆర్, హరీశ్ రావులకు చోటు కల్పిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కల్పిస్తున్నట్లు నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఇప్పటికి మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరనుంది.

టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నట్లుగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు కనుక మంత్రివర్గంలో అవకాశం లభిస్తే.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా మంత్రులుగా వీరు నిలవనున్నారు.

తొలివిడత ప్రభుత్వంలో కేసీఆర్ మహిళా మంత్రులకు స్థానం కల్పించకపోవటంపై రాజకీయంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

కాగా, హరీశ్ రావు, గంగుల కమలాకర్ తదితరుల నివాసాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com