తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్.. వాస్తవ లెక్కలు..
- September 09, 2019
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బడ్జెట్‌ను రూపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. భారీ అంచనాలను తగ్గించి వాస్తవ లెక్కల ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎదురయ్యే సానుకూల, ప్రతికూల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి ప్రతిపైసాకు పక్కా ప్రణాళికతో బడ్జెట్‌కు తుది రూపు ఇచ్చారు. సోమవారం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గత బడ్జెట్ కంటే కాస్త భిన్నంగా ఉండే అవకాశముంది.
ప్రస్తుతం కొనసాగుతున్న మాంద్యం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడులు ఎలా ఉంటాయి? వృద్ధిరేటులో ఎంత తేడా ఉంటుంది? కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల ఏ మేరకు ఉంటుంది? గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లో ఎంత మార్పు వస్తుంది? అనే అంశాలను సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో అధికారులు నిశితంగా పరిశీలించి లెక్కలువేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.1,82,017 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ తాత్కాలిక బడ్జెట్‌ను శాసనసభ, శాసనమండలి ఆమోదించాయి.
తెలంగాణలో జీఎస్డీపీ వృద్ధిరేటు స్థిరంగా ఉన్నప్పటికీ గత ఏడాదిన్నర కాలం నుంచి కేంద్ర జీడీపీ వేగంగా పడిపోతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. దేశంలోని దాదాపు అన్ని రంగాల్లో రాబడులు తగ్గడంతోపాటు ప్రతి మూడునెలలకు జీడీపీ వృద్ధిరేటు ఆందోళనకర స్థాయిలో క్షీణించడం తో యూపీఏ సర్కారు హయాంలో 8 శాతానికి చేరిన జీడీపీ వృద్ధిరేటు ఇప్పుడు 5 శాతానికి దిగజారింది. ఈ ప్రభావం రాష్ట్రంపై కూడా పడింది. కేంద్రం తనకు వచ్చే మొత్తం రాబడిలో 42 శాతాన్ని రాష్ట్రాలకు పంచుతుండగా… అందులో తెలంగాణకు 3.482 శాతం వాటా దక్కుతుంది. ఈసారి జాతీయ స్థాయిలో పన్నుల రాబడి బాగా క్షీణిస్తుండటంతో రాష్ట్రాలకు వచ్చే వాటా కూడా అదే స్థాయిలో తగ్గే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి రూ.20,583 కోట్ల వరకు రావచ్చని అంచనా వేయగా.. ఆగస్టులో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో అదికాస్తా రూ.19 వేలకోట్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తిస్థాయి బడ్జెట్లో అంచనాలను సవరించింది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా రూ.18 వేలకోట్లలోపే ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అంటే ఈ ఒక్క అంశంలోనే రాష్ట్రం రూ.2 వేలకోట్ల ఆదాయాన్ని కోల్పో తున్నట్లూ ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు.. ఇక కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రాష్ర్టానికి రూ.22 వేలకోట్ల వరకు రావచ్చని గతంలో భావించారు. కానీ మారిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కోటా తగ్గింది. దీంతో గ్రాంట్-ఇన్-ఎయిడ్ మొత్తంలో దాదాపు రూ.3 వేలకోట్ల వరకు తగ్గే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తన అంచనాలను కుదించుకోవాల్సి వచ్చింది. మరోవైపు జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రాబడి తగ్గడం కూడా రాష్ట్రంపై ప్రభావం చూపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడునెలల వరకు రాష్ట్ర సొంత రాబడులు బాగానే ఉన్నప్పటికీ ఆర్థిక మాంద్యం నీడలు ఇప్పుడిప్పుడే ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రవాణారంగంపై తీవ్రప్రభావం పడింది. ఆబ్కారీ, పెట్రోల్‌పై కూడా వ్యాట్ రాబడి తగ్గుతున్నది. జీఎస్టీ రాబడి వృద్ధిరేటు కూడా తగ్గుతోంది. దీంతో రానున్న ఆరు నెలల కాలంలో సొంత రాబడుల వృద్ధిరేటు ఎంత మేరకు తగ్గుతుంది? గత సంవత్సరం కంటే రాబడి ఎంత మేరకు తగ్గవచ్చు? అనే విషయాలను లెక్కగడుతున్నారు. ఆదాయం పెరిగినా లేక తగ్గినా అది బడ్జెట్లో ప్రతిబింబించి తీరాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయడంతో ప్రతిపైసాకు పక్కాగా లెక్క ఉండేలా అధికారులు పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుదిరూపం ఇచ్చారు.
సొంత పన్నుల రాబడి ఈసారి రూ.66 వేలకోట్ల నుంచి రూ.84 వేలకోట్లకు పెరగవచ్చని తాత్కాలిక బడ్జెట్లో అంచనా వేశారు. కానీ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ అంచనాలను సవరిస్తున్నారు. రూ.70 వేలకోట్ల నుంచి రూ.74 వేలకోట్ల వరకు సవరించవచ్చని సమాచారం. మొత్తానికి.. ఈ సారి బడ్జెట్ గతం కంటే భిన్నంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







