చంద్రయాన్ 2 మిషన్ వైఫల్యంపై ఇస్రో ఛైర్మన్ సంచలన ప్రకటన: ఆరా తీస్తోన్న కేంద్రం!
- September 26, 2019
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ వైఫల్యంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఏ పరిస్థితుల్లో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందకుండా పోయాయనే విషయంపై అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ జాతీయ కమిటీ తన దర్యాప్తును ఆరంభించింది కూడా. ఈ కమిటీ సమావేశానికి హాజరు కావడానికి ఇస్రో ఛైర్మన్ కే శివన్ గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
ఆర్బిటర్ నుంచి స్పష్టమైన సంకేతాలు..
విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోయినప్పటికీ.. దాని ఆర్బిటర్ మాత్రం చక్కగా పని చేస్తోందని తెలిపారు. అర్బిటర్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కు సంకేతాలు వస్తున్నాయని అన్నారు. కీలకమైన ల్యాండర్ తో సంకేతాల పునరుద్ధరణపై ఎలాంటి తాజా సమాచారం లేదని చెప్పారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ తమ అంచనాలకు మించి రాణిస్తోందని అన్నారు. అత్యధిక రిజల్యూషన్ తో గల ఫొటోలు, ఇతర డేటా సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ కు చేరవేస్తోందని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతు కావడంపై జాతీయ స్థాయి కమిటీ ఆరా తీస్తోందని, ఆ సమావేశంలో పాల్గొనడానికి తాను న్యూఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు.
క్రాష్ ల్యాండింగ్ కే అవకాశం..
చంద్రయాన్ 2 మిషన్ లో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై అడుగు పెట్టాల్సి ఉంది. చంద్రుడి ఉపరితలం పైనుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి హఠాత్తుగా సంకేతాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత దాని ఆచూకీ తెలియ రాలేదు. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగినప్పటికీ.. అది క్రాష్ ల్యాండింగ్ కు గురై ఉంటుందని కే శివన్ తెలిపారు. అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ తో అనుసంధానం కావడానికి చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఆరా తీస్తోన్న కేంద్రం.. జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు
ఈ వైఫల్యంపై ఆరా తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే తన కార్యకలాపాలను ఆరంభించింది కూడా. ఇస్రో నుంచి కొంత కీలక సమాచారాన్ని తెప్పించుకుంది. చివరి నిమిషంలో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సి ఉన్న విక్రమ్ ల్యాండర్.. ఏ కారణాల వల్ల లేదా ఎలాంటి పరికరాలు పనిచేయకపోవడం వల్ల స్తంభించిపోయిందనే విషయంపై సమగ్ర వివరాలను సేకరిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండింగ్ కావడానికి గల కారణాలపై అన్వేషణ మొదలు పెట్టింది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇస్రో ఛైర్మన్ శివన్ గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







