ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

- September 26, 2019 , by Maagulf
ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

 

విశాఖ: ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలెక్కింది.  విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలును..  రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప)  పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. 

పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. 22701/22702 ట్రైన్‌ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు వారానికి 5 రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. అన్ని కోచ్‌లలో డిస్క్‌ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్‌ ఇండికేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్‌ ఏర్పాటుతో పాటు ప్రయాణ వేగం, తదుపరి స్టేషన్‌ వివరాలు తెలిపేందుకు ప్రతి కోచ్‌లో ఆరు డిస్‌ ప్లే మానిటర్లు ఏర్పాటు సదుపాయం ఉంటుంది. కోచ్‌ల్లో ఆటోమేటిక్‌ టీ, కాఫీ వెండింగ్‌ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడో కోచ్‌ తర్వాత పాంట్రీ, డైనింగ్‌ సౌకర్యాలు ఉంటాయి. ఇక చిన్న పొగ వచ్చినా వెంటన సమాచారం అందేలా కోచ్‌లలో వెస్‌ డా యంత్రాల అమరిక ఉంటుంది. 

ప్రారంభోత్సవం రోజు: విశాఖ–విజయవాడ (02701) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో ఉదయం 11.30గంటలకు బయల్దేరి సాయంత్రం 4.50గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (02702) ఎక్స్‌ప్రెస్‌గా విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి రాత్రి 11గంటలకు విశాఖ చేరుకుంటుంది. 
ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ హాల్టులు: ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 9 ఏసీ డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 2–మోటార్‌ పవర్‌కార్‌లతో నడుస్తుంది.  
ఎంవీవీ తొలి విజయం: కాగా  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. 

విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ చెన్నబసప్పను కలిసి డబుల్‌ డెక్కర్‌ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్‌ డెక్కర్‌ రైలు నడపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉదయ్‌ ఇవాళ పట్టాలెక్కింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com