అబుధాబి లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

- October 06, 2019 , by Maagulf
అబుధాబి లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

అబుధాబి: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యూఏఈ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుధాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  అబుధాబి లోని తెలంగాణ సంఘం ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు  చేశారు.  ఈ అద్భుత కార్యక్రమానికి అబుధాబి లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యింది.

యూఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు.  ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో ఇండియా నుండి వందలాది కిలోల వివిధ పూల ను తెప్పించి అబుధాబి ని పూల వనంగా మార్చారు. 

కార్యక్రమం రోజు (October 5 శనివారం) ఉదయం ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు.  ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాటలతో మార్మోగించారు.  శనివారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి వందలాది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు బహుముఖ ప్రగ్యాశాలి కోకిల నాగరాజు, ప్రముఖ కవి గాయకుడు సాయి చాంద్ మరియు తెలంగాణ నూతన తేజం టి న్యూస్ ధూమ్ ధామ్ ముచ్చట్ల యాంకర్ కుమారి ఉదయ శ్రీ  ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణా సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు.  ఆ తరువాత వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. ఇండియా నుండి వఛ్చిన ముగ్గురు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.

తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదట గా వచ్చిన 5 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమ స్పాన్సర్స్ బూర్జిల్ హాస్పిటల్, పే ఇట్, రాయల్ రెజిస్, ఎస్పాకో, ఎన్ ఎం సి, యు ఏ ఈ ఎక్స్చేంజి, ఆసమ్ సలోన్, రోచన గ్రూప్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.  చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు. ఈ కార్యక్రమాన్ని గోపాల్,  వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్,  రాజశ్రీనివాస రావు, అశోక్ ,  శ్రీనివాస్ రెడ్డి,  పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు తెలియజేశారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com