అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

- October 16, 2019 , by Maagulf
అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

అయోధ్య వ్యవహారం చివరి అంకానికి చేరింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కక్షిదారులు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. వివాదాస్పద ప్రాంతం ఎవరికి చెందుతుందనే అంశంపై కక్షిదారుల తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరాలు సమర్పించారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 17లోపు తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది.

ఇక, వాదనల చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. ముస్లింల తరపున వాదిస్తున్న లాయర్ రాజీవ్ ధావన్, కోర్టురూమ్‌లోనే పేపర్లను చింపేశారు. అయోధ్య రివిజిటెడ్ అనే పుస్తకాన్ని హిందూ మహాసభ సుప్రీంకోర్టుకు సమర్పించింది. రాముడు జన్మస్థలాన్ని చూపిస్తున్న నక్షత్రం ఆ మ్యాప్‌లో ఉంది. ఇతర డాక్యుమెంట్లతో మ్యాప్‌ను సరిచూసుకోవాలని హిందూ మహాసభ కోర్టును కోరింది. ఐతే లాయర్ ధావన్ దాన్ని వ్యతిరేకించారు. అయోధ్య మ్యాప్ పేజీని ఆయన చింపేశారు. రాజీవ్ ధవన్ తీరుపై చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో సరిగా ప్రవర్తించాలని ఘాటుగా మందలించారు. ఇలాగే వ్యవహరిస్తే కోర్టు నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, అయోధ్య కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవాలని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. టైటిల్ సూట్ నుంచి కేసును ఉపసంహరించాలని నిర్ణయించామని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. అయోధ్యలోని 22 మసీదుల మెయింటెనెన్స్ చూసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు మధ్యవర్తుల కమిటీ సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. ఈ నిర్ణయంపై కొందరు ఇమామ్‌లు తీవ్రంగా స్పందించారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఎందుకు వెనక్కి తగ్గిందని సూటిగా ప్రశ్నించారు. కేసు నుంచి వెనక్కతగ్గడానికి వక్ఫ్ బోర్డులోని సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే కారణమని సమాచారం. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జేఏ ఫారుఖీపై ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. వక్ఫ్ బోర్డు భూములను అక్రమంగా అమ్మేశారని ఫారుఖీపై ఆరోపణలొచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com