మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కేంద్రీకృత విధానం అవసరం: ఏపీ గవర్నర్

- April 08, 2021 , by Maagulf
మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో  కేంద్రీకృత విధానం అవసరం: ఏపీ గవర్నర్

విజయవాడ: మానవ అక్రమ రవాణాను కేంద్రీకృత విధానంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు.

రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో  మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి ప్రజ్వల సంస్థ రూపొందించిన   హ్యాండ్ బుక్స్ ను గవర్నర్ హరిచందన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్  మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఎదుర్కునే క్రమంలో రూపొందించిన స్నేహ పూర్వకమైన ఈ ఐదు చేతి ప్రతులు  ఉపయోగకరంగా ఉంటాయని, అక్రమ రవాణాను నివారించడంలో పాటు, సమస్యను పరిష్కరించడంలో మార్గదర్శకత్వం వహిస్తాయని అన్నారు. జ్యుడిషియల్ ఆఫీసర్లు, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, లేబర్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీ సంస్థల నిర్వహకులకు ఈ పుస్తకాలు సహాయకారిగా ఉంటాయని తెలిపారు. ‘హ్యాండ్‌ బుక్ ఆన్ కౌంటర్ హ్యూమన్ ట్రాఫికింగ్’ పేరిట వీటిని తీర్చి దిద్దటం మంచి ప్రయత్నమన్నారు. మానవ అక్రమ రవాణా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఉపకరించే విధంగా  ప్రస్తుత చట్టాలు, విధానాలు, తీర్పులను ఈ పుస్తకాలలో సమకూర్చారని, ‘నివారణ, రక్షణ, పునరావాసం, పున-సమైక్యత’ ఉద్దేశ్యంతో అక్రమ రవాణా, సంబంధిత నేరాలపై మార్గదర్శక కృషి చేసినందుకు  శ్రీమతి సునీతా కృష్ణన్, ఆమె బృందాన్ని  గవర్నర్  ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com