17 ఏళ్ల యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్

- June 02, 2021 , by Maagulf
17 ఏళ్ల యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్

సౌదీ: కింగ్డమ్ లోని యువకులతో సమానంగా యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్ జారీ చేయనున్నట్లు సౌదీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువతులు డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే..తాత్కాలిక అనుమతులకు కొన్ని షరతులు వర్తిస్తాయని కూడా వెల్లడించింది. డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే యువతులు తప్పనిసరిగా 17 ఏళ్లు నిండి ఉండాలని వెల్లడించింది. దరఖాస్తు సమయంలో ఆరు ఫోటోలతో పాటు హెల్త్ చెకప్ ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రైవింగ్ పర్మిట్ కాలపరిమితి ఏడాది పాటు ఉంటుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత డ్రైవింగ్ పర్మిట్ ను డ్రైవింగ్ లైసెన్స్ గా మార్చుకోవచ్చు. అయితే..డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి నిబంధనల మేరకు సదరు మహిళపై డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండకూడదు. డ్రైవింగ్ కు ఇబ్బంది కలిగించేలా ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే..దరఖాస్తు సమయానికి అన్నింటిని క్లియర్ చేసుకోవాలి. దరఖాస్తుదారులు  సౌదీయేతరులు అయితే..రెసిడెన్సీ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ స్కూల్స్ లో నిర్వహించే థియేరిటికల్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఐదేళ్లు లేదా పదేళ్ల కాలపరిమితి డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com