తెలంగాణ: ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

- December 01, 2021 , by Maagulf
తెలంగాణ: ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది… డీజిల్‌ ధరలు పెరగడం, కరోనా దెబ్బకొట్టడంతో.. చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది టీఎస్‌ఆర్టీసీ.. అయితే, ఆర్టీసీ చార్జీలు ఎంతమేర పెంచనున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని.. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1న 20 పైసల మేర చార్జీలు పెంచామని గుర్తుచేసిన ఆయన.. చార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని.. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సజ్జనార్.. 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని తెలిపారు. ఇక, గతంలో లీటర్‌ డీజిల్‌ రూ. 68.29 ఉంటే.. అది ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయిందని.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏకంగా రూ. 480 కోట్ల నష్టం వాటిల్లిందని.. రూ.1,440 కోట్లు ఈ సంవత్సరం నష్టాలు ఉన్నాయని తెలిపారు.

ఇక, చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 25 పైసలు పల్లె వెలుగుకు, 30 పైసలు ఎక్స్ ప్రెస్‌లకు, ఇతర సర్వీసులకు పెంచాలని కోరుతున్నామన్న ఆయన.. రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. చార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 525 కొత్త బస్సులు కొనుగోలు చేశాం… ఆర్టీసీలో అనేక మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న తరహాలో ఆర్టీసీకి ప్రచారం కల్పిస్తున్నారు.. అంతేకాదు.. ఆ సంస్థను లాభాల బాటలోకి నడిపిస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిలో భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com