ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

- December 01, 2021 , by Maagulf
ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

హైదరాబాద్: ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో శాస్త్రపరంగా అంతిమ సంస్కారాలు జరిగాయి. కడసారి చూపు కోసం సినీ పరిశ్రమలోని ప్రముఖులు, 24 విభాగాల వాళ్లంతా తరలి వచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పాటలతో చైతన్యం నింపిన పాటలరేడు.. అలా అచేతనంగా ఉండడం చూసి కన్నీళ్లు ఆగలేదు. సిరివెన్నెలతో ఆత్మీయ బంధం ఏర్పరుచుకున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ కలం ఇక రాయదని, సిరి లోగిలి నుంచి ఇకపై పాటలు రావని తలచుకుంటూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. పదంతో సమాజాన్ని కదిపిన సిరివెన్నెల ఆఖరి మజిలీలో.. నేను సైతం అంటూ పదం కలిపారు అభిమానులు.

సిరివెన్నెల కురిపించి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిన సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు.. అంతులేని వేదనతో సుడిగుండాలు అయ్యాయి. మాటలకందని విషాదం గుండెల్ని పిండేస్తుంటే.. బరువెక్కిన హృదయాలతో అక్కడికి వచ్చిన వారందరికి కళ్లలోనూ నీటిసుడులు తిరిగాయి. సినీరంగంతో అనుబంధం ఉన్నవారితోపాటు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అంతా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, వెలకట్టలేని అభిమానాన్ని పొందారు కాబట్టే.. ఆయన ఇక లేరనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీరంగానికి సీతారామశాస్త్రి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ఈ అంతులేని విషాదం అలుముకున్న వేళ.. సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చడం ఇప్పుడు ఎవరివల్లా కావడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com