గుడ్‌ ఫ్రైడే!

- March 24, 2016 , by Maagulf
గుడ్‌ ఫ్రైడే!

గుడ్‌ ఫ్రైడే! ప్రభువు శిలువ వేయబడిన దినం. పాపుల రక్షకుడైన ఏసు శిలువపై రక్తం చిందించిన శుక్రవారం ‘మంచి’దెలా అవుతుంది? పాపుల రక్షణకై శిలువపై క్రీస్తు బలిదానం చేశాడు కాబట్టే ఆరోజును గుడ్‌ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం అనే మాట వింటూ ఉంటాం.   అయితే పరమ శక్తిమంతుడైన ఏసు చావునెలా తప్పించుకోలేకపోయాడు? అంత నిస్సహాయుడిగా ఎందుకు మిగిలిపోయాడు? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసునీ ఏదో ఓ సందర్భంలో తొలిచేస్తూనే ఉంటాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానం అందాలంటే ఆది నుంచి విశ్లేషించుకోవాలి. ‘తండ్రి తన కుమారుడిని ఈ ప్రపంచం కోసం ప్రాణాలర్పించటానికే పంపించాడు.’ ఇది క్రైస్తవులందరూ అంగీకరించే విషయం. అయితే ఆయన ఎందుకిలా చేశాడు? దీని అంతరార్థం ఏమిటి? తండ్రి యెహోవా ఈ ప్రపంచాన్నెంతో ఇష్టంతో సృజించాడు. ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమే అంతకంటే అధికంగా ప్రేమించే కుమారుడిని ఈ ప్రపంచంలోకి పంపించాడు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’ (యోహాను 3:16) తండ్రి తనను సృష్టించిన ఉద్దేశానుసారం నడుచుకున్న ఏసు శిలువపై ప్రాణాలు విడిచి పాపులను రక్షించాడు. అంటే ఏసు కారణజన్ముడనే విషయం ఇక్కడ అర్థమైపోతోంది. అలాంటప్పుడు...మన కోసం ప్రాణాలర్పించిన ఏసు కోసం మనమేం చేయాలి? ఆయన్ను అనుసరించే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏసును అనుసరిస్తున్న మనం గుడ్‌ ఫ్రైడేను అక్కున చేర్చుకోవాలి. అంటే...యేసు పొందిన హింసను ఆలింగనం చేసుకోవాలి.   గుడ్‌ ఫ్రైౖడే నాడు జరిగిన సంగతులను ఓసారి మననం చేసుకుంటే... ఆరోజుకు ముందునుంచే తాను జెరూసలేం వెళ్లాలని, ప్రధాన యాజకులు, పెద్దల చేతుల్లో హింసననుభవించి చంపబడి, మూడవ దినమున పునరుద్ధానం పొందబడతానని ఏసు తన శిష్యులకు మూడు సందర్భాల్లో వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు పేతురు ఆయనను పక్కకు తీసుకెళ్లి ‘అలా ఎప్పటికీ జరగదని’ చెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏసు పేతురుతో ఇలా అన్నాడు... ‘సాతానా! నా వెనుకకు పొమ్ము: నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు. నీవు మనుష్యుల సంగతులే తలంచుచున్నావుగాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను! అప్పుడు యేసు తన శిష్యులను చూచి - ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్ను తాను ఉపేక్షించుకుని, తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.’ (మత్తయి 16: 21 - 25) గుడ్‌ ఫ్రైడేను ఏ అర్థంతో చూడాలంటే... అంతకుపూర్వం ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ తిరస్కరిస్తూ అపారమైన ఆయన శక్తి, ఙ్ఞానము ఆయనను శిలువవైపు నడిపించాయి. ఆయన శక్తిని కళ్లారా చూసిన వాళ్లంతా ఆ శక్తి అత్యంత అవసరమైననాడు ఆయన నిస్సత్తువతో ఉండిపోవటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఙ్ఞానాన్ని రుచి చూసిన వారంతా ఆయనకు ముందుచూపు లేకపోవటాన్ని చూసి విస్తుపోయారు. అయితే వీళ్లంతా తండ్రి, కుమారుల ఉద్దేశాలను గ్రహించలేకపోయారు. ‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానేయుండును: అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.’ (యోహాను 12:24) ఆయన మాటలే కాదు ఆయన జీవితం కూడా ఉపమానమే! శిలువపై క్రీస్తు రెండు మాటలన్నాడు: ‘నన్నెందుకు విడిచితివి?, ‘తండ్రీ! నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను’. ఈ వాక్యాలనుబట్టి కుమారుడు తండ్రి మీద ఎంతటి నమ్మకముంచాలో యేసు మనకు ప్రత్యక్షంగా చూపించాడు. మనల్ని మనం తరచి చూసుకుని, శిలువ వైపు, ఏసు మాటల వైపు మనల్ని తిప్పేలా చేస్తూ ఏసు ఎత్తి పట్టుకున్న అద్దంలా గుడ్‌ ఫ్రైడేను భావించాలి. ఒకసారి శిలువవైపు మనసును మళ్లిస్తే ‘తండ్రీ! వేరేం చేస్తున్నారో వీరెరుగరు. కావున వారిని క్షమించుము’ అనే మాటలు మనకు తప్పక వినిపిస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com