విద్యారంగంలో భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలి: ఉపరాష్ట్రపతి

- March 20, 2022 , by Maagulf
విద్యారంగంలో భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలి: ఉపరాష్ట్రపతి

హరిద్వార్: ప్రపంచానికి విశ్వగురువుగా మార్గదర్శనం చేసిన వైభవోపేతమైన ప్రాచీన భారత  విద్యావిధానాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన విద్యావిధానానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రాచీన విద్యావిధానాలు, ప్రస్తుత పరిస్థితుల మధ్య సమన్వయం జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్ ను ఉపరాష్ట్రపతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శతాబ్దాలపాటు విదేశీ పాలకులు భారతదేశ విద్యావిధానాన్ని నష్టపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు.

సుదీర్ఘకాలంపాటు సాగిన విదేశీ పాలన కారణంగా సమాజంలోని వెనుకబడిన వర్గాలు, మహిళలు విద్యాఫలాలను పొందలేకపోయారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ సమయంలో కొందరికే విద్య అందుబాటులో ఉండేదన్నారు. ‘అందరికీ విద్యనందించడం మన ప్రస్తుత లక్ష్యం కావాలి. అప్పుడే మన విద్యావిధానం సమగ్రం, ప్రజాస్వామికం అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ఈ దిశగా వేసిన ముందడుగన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మానవాళి పురోగతి కోసం శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యంత అవసరం అని ఉపరాష్ట్రపతి సూచించారు. శాంతి, సామరస్య పూర్వక వాతావరణం యావత్ ప్రపంచానికి అత్యంత అవసరమన్నారు.
భారతదేశం ‘వసుధైవ కుటుంబకం’, ‘సర్వేభవంతు సుఖిన:’ వంటి నినాదాలను, జీవన విధానాలుగా మార్చుకుందని ఉపరాష్ట్రపతి అన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా శాంతికాముక దేశంగా తనదైన గుర్తింపు పొందిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని’గా విశ్వమానవాళికి మార్గదర్శనం కూడా చేస్తోందన్నారు.
గాయత్రి తీర్థ వ్యవస్థాపనకు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్ వ్యవస్థాపనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి.. ప్రపంచవ్యాప్తంగా శాంతిసామరస్యాలు వెల్లివిరియడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషించాలని అభిలషించారు. 

ఈ సందర్భంగా బుద్ధుడు, అశోకుడిని ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. యుద్ధ ఘోష నుంచి ధమ్మ ఘోష, పంచశీల సిద్ధాంతాలవైపు అశోకుడి ఆలోచన మారిన కారణాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయంలో యోగ, ధ్యానం తదితర అంశాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టడాన్నీ ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన విలువైన కానుక యోగ అని ఆయన అన్నారు.
ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి, ఆసియాలోని ప్రప్రథమ సెంటర్ ఫర్ బాల్టిక్ కల్చర్, స్టడీస్ ను సందర్శించారు. ప్రయాగేశ్ మహాకాళ్ మందిరాన్ని సందర్శించి మందిర ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయ కులపతి డాక్టర్ ప్రణవ్ పాండ్యా, ఉపకులపతి డాక్టర్ చిన్మయ్ పాండ్యా, ప్రొ-వైస్ చాన్సలర్, బోధనాసిబ్బంది, విద్యార్థులు, ఉత్తరాఖండ్ లోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com