అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- August 26, 2026
అల్ ఐన్: పాఠశాలలు పునఃప్రారంభం కానున్న వేళ అల్ ఐన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్క్ సమీపంలో ఉన్న వాటర్ కూలర్‌ను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురైన 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడిని అరబ్ ప్రవాస కుటుంబానికి చెందిన వలీద్ ఖాలెద్గా గుర్తించారు. కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న వలీద్.. స్కూల్ బ్యాగ్, స్టేషనరీని సిద్ధం చేసుకోవడంతో పాటు స్కూల్ స్పోర్ట్స్ యూనిఫాం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
అయితే పాఠశాల ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న బాలుడి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వలీద్ తన అన్నయ్య, స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోని పార్క్‌కు ఆడుకోవడానికి వెళ్లాడు.
ఈ సమయంలో ఒక బాలుడు సమీపంలోని ఓ ఇంటి బయట ఉన్న వాటర్ కూలర్ వద్దకు వెళ్లాడు. పిల్లలు గతంలో కూడా ఆ కూలర్ నుంచి నీరు తాగేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. కూలర్‌ను తాకగానే ఆ బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు.
వలీద్ అన్నయ్య అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. వలీద్‌కు అది సరదాగా చేసిన పనేమోనని అనిపించి, ఏమైందో తెలుసుకునేందుకు కూలర్ దగ్గరకు వెళ్లాడు. అయితే కూలర్‌ను తాకగానే అతనికి కూడా విద్యుత్ ప్రవాహం తగిలినట్లు అనిపించింది. వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత వలీద్ కూలర్‌ను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు.
భయంతో అహ్మద్ వెంటనే ఇంటికి పరుగెత్తుకెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న వలీద్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
విద్యుత్ భద్రత పై హెచ్చరికలు
ఈ ఘటనతో పిల్లలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరిగా నిర్వహణ చేయని లేదా లోపభూయిష్టంగా ఉన్న విద్యుత్ పరికరాలు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పార్కులు, నివాస ప్రాంతాలు, పాఠశాలల సమీపంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, లోపాలు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేయడం ఎంతో కీలకమని సూచిస్తున్నారు.
పాఠశాలలో విషాద ఛాయలు
వలీద్ మృతితో అతను చదువుతున్న పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది బాలుడికి నివాళులు అర్పించారు.
వలీద్ ఎంతో మర్యాదగా, దయగల మనసుతో ఉండేవాడని, తోటి విద్యార్థులతో ఎంతో స్నేహంగా మెలిగేవాడని పాఠశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు. అతని తల్లిదండ్రులు, సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







