ఆసియా కప్‌ 2022: హాంకాంగ్ పై భారత్ ఘన విజయం

- August 31, 2022 , by Maagulf
ఆసియా కప్‌ 2022: హాంకాంగ్ పై భారత్ ఘన విజయం

దుబాయ్: ఆసియా కప్‌ 2022లో భాగంగా బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో గ్రూప్ 'ఎ'లో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.ఆసియా కప్ 2022 సూపర్ 4 దశకు భారత్ క్వాలి ఫై అయ్యింది. 

193 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ లు మెరుగ్గా బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ తీశారు. అవేశ్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్ లు కూడా చెరో వికెట్ తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్ 'ఎ' నుంచి భారత్ సూపర్ ్4 దశకు చేరుకుంది. శుక్రవారం హాంకాంగ్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అందులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్ 4కు చేరుతుంది. ఇప్పటి వరకు భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మాత్రమే సూపర్ 4 దశకు చేరాయి. రేపు బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తర్వాతి దశకు వెళ్తుంది.హాంకాంగ్ జట్టులో బాబర్ హయ్యత్ (35 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కించిత్ షా (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), జీషన్ అలీ (17 బంతుల్లో 26 నాటౌట్; స్కాట్ మెక్ చినీ (8 బంతుల్లో 16 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. అవేశ్ ఖాన్ తన నాలుగు ఓవర్ల స్పెల్ లో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. అర్ష్ దీప్ 4 ఓవర్ల స్పెల్ లో 44 పరుగులు ఇచ్చుకుని ఒక వికెట్ తీశాడు.

అంతకు ముందు సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 68 పరుగులతో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉండటం విశేషం. సూర్యకుమార్ యాదవ్ కు తోడు విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 192 పరుగుల భారీ స్కోరును సాధించింది. హాంకాంగ్ బౌలర్లలో ఆయుశ్ శుక్లా, మొహమ్మద్ ఘజాన్ ఫర్ చెరో వికెట్ సాధించారు.

సూపర్ సూర్య 13వ ఓవర్ ఆఖరి బంతికి కేఎల్ రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. అప్పటికి భారత స్కోరు 2 వికెట్లకు 94 పరుగులు. ఆ దశలో భారత్ 150 పరుగులు చేయడం గగనంలా అనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ భారత్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. రాకెట్ వేగంతో ముందుకు నడిపాడు. ఫోర్లు, సిక్సర్లతో గ్రౌండ్ ను ముంచెత్తాడు. మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ కూడా భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆసియా కప్ లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 31వది కాగా. . ఈ ఏడాది రెండోది. కోహ్లీ అర్ధ సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరింతగా చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో 6, 6, 6, 0, 6, 2తో మొత్తం 26 పరుగులు రాబట్టాడు. దాంతో భారత్ 192 పరుగులకు చేరుకుంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు కేవలం 42 బంతుల్లో 98 పరుగులు జోడించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com