దక్షిణకొరియాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 151 మంది మృతి

- October 30, 2022 , by Maagulf
దక్షిణకొరియాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 151 మంది మృతి

సియోల్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘోరం సంభవించింది. ప్రతీ ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ సారి అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని ఒక ఇరుకైన వీధిలో ఒక్కసారిగా వందలాది మంది ప్రజలు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 151 మంది మృతి చెందినట్లు నగర ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఒకేసారి భారీ ఎత్తున ప్రజలు రావడం, భయభ్రాంతులకు గురైన వాళ్లు కంగారుగా పరుగులు తీయడానికి ప్రయత్నించడంతో చాలా మంది కిందపడ్డారు. వెనుక వస్తున్న వాళ్లు ఏం జరుగుతుందో తెలియక.. కింద పడిన వారి మీద నుంచి పరుగులు తీశారు.

చాలా మంది కింద పడిన తర్వాత గుండె పోటుతో మృత్యువాత పడ్డారని సియోల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ చోయ్ సియాంగ్ బియోమ్ తెలియజేశారు. మృతి చెందిన వారిలో 19 మంది విదేశీయలు కూడా ఉన్నారని.. అయితే ఎవరు ఏ దేశానికి చెందిన వారో ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారని.. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మరో 150 మందికి పైగా గాయపడినట్లుగా కూడా చెప్పారు. సంఘటన గురించి తెలుసుకున్న సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ విచారం వ్యక్తం చేశారు. ఇవ్వాళ (ఆదివారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com