హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి

- March 28, 2023 , by Maagulf
హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని 50 చెరువులను  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద అభివృద్ధి, సుందరీకరణకు ముందుకు వచ్చిన నిర్మాణ రంగ సంస్థలు వరల్డ్ సిటీ స్థాయిలో పనులు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎం.పి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఆకుల లలిత, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ సత్తెనపల్లి శాసనసభ్యులు  సండ్ర వెంకట వీరయ్య,  స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, సిసిపి దేవేందర్ రెడ్డి, సి.ఇ సురేష్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఇంజనీరింగ్ విభాగం అధికారులు, నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం లో వరద నివారణ, ప్రజలకు నీటి అవసరాలు అప్పటి నిజాం ప్రభువుల ఆదేశాల మేరకు ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు  1908 సంవత్సరంలో రూపకల్పన చేయగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట చెరువులు 1920 లో అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ కృష్ణా బేషన్ లో ఉన్నదని, 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకే నీరు ప్రవహిస్తుందన్నారు.

 సి.యస్.అర్ పద్దతి ద్వారా చేపట్టే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సేద తీరడానికి కుర్చీల ఏర్పాటు, వ్యాయామ శాల, ఆట స్థలం, థీమ్ పార్కు, టాయిలెట్స్, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. చెరువులలో ప్రైవేట్ ల్యాండ్ ఉన్నచో వాటిని టి.డి.ఆర్ జారీచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 13 చెరువులలో ఉన్న 115 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించి 200 శాతం  విలువ తో టి.డి.ఆర్ లను జారీచేసినట్లు మంత్రి తెలిపారు. చెరువులను వారికి రాసివ్వడం లేదు. సుందరీకరణ అభివృదద్ది కోసమే వారితో ఖర్చు చేయించడం జరుగుతున్నది. తీసుకున్న చెరువులలో చిన్న తప్పు జరిగినా అందరం బద్నాం అవుతామని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎం.ఏ.యు.డి స్పెషల్ సి.ఎస్, జిహెచ్ఎంసి కమిషనర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. చెరువుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ లను డీమార్క్ చేసి మ్యాప్లు లు సిద్దంగా ఉన్నాయన్నారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా శాటిలైట్ మ్యాప్ ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు డిమార్క్ చేస్తున్నామని అన్నారు. నిర్మాణ రంగ సంస్థలు చెరువుల సుందరీకరణకు సామాజిక బాధ్యత తో ముందుకు వచ్చినందున లాభాల కోసం చూడకుండా మన ముందు తరాల వారికి ఉపయోగపడే విధంగా ఖర్చుకు వెనుకాడకూడదన్నారు.  

ఈ ఎనిమిదేళ్లలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సంస్థలు ముందుకు వస్తాయని, పెట్టుబడుల విషయంలో పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావని, దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని, 2022 సంవత్సరంలో మన హైదరబాద్ కు ఆఫీస్ ఫేస్ లో నెంబర్ 1 వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం వ్యాక్సిన్  నగరంగా పేరుగాంచింది. హైదరాబాద్ నగరం నుండి భవిష్యత్ లో 1400 కోట్ల వ్యాక్సిన్ లను ప్రపంచ దేశాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 

దుర్గం చెరువు ను డెవలప్ చేయడం ద్వారా టూరిస్ట్ అట్రాక్షన్, సినిమా షూటింగ్ లకు నిలయంగా మారిందన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 185 చెరువు ల డెవలప్ చేేసేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద సుందరీకరణ, మెయింటెనెన్స్ కు ఎం.ఓ.యు చేసుకుంనేందుకు ఆసక్తి గల వారు ముందుకు రావాలని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి 51 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం ఎం.ఓ.యు పత్రాలను వారికి అందజేశారు. అందులో జిహెచ్ఎంసికి చెందినవి 26, హెచ్.ఎం.డి.ఏ కు చెందినవి 25 చెరువులు ఉన్నవి. ఇటీవల ఫాక్స్ ఖాన్ చైర్మన్ హైదరాబాద్ ను సందర్శించిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు హైదరాబాద్ సిటీ అద్బుతంగా ఉందని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. కొంగరకలాన్ లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడం ద్వారా 30వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది, అంతే కాకుండా ఐటీ రంగంలో గత ఏడాది లక్షా 50వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. వివిధ కంపెనీల ద్వారా అనేక ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని, ఫార్మా సిటీ ద్వారా ఉద్యోగాలతో పాటు ప్రపంచంలోనే పెద్ద ఫార్మాసిటీ గా అవతరిస్తుందని తెలిపారు.  

హైదరాబాద్ నగరాన్ని 2023 జూలై నాటికి వంద శాతం మురుగునీరు శుద్ధి చేసేందుకు ఎస్.టి.పి ల నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం దేశం లోనే ఫార్మా సిటీ గా గుర్తింపు పొందుతుందని తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ముందంజలో ఉందని తెలిపారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 మిలియన్ల డాలర్లుగా అంచనా వేయగా 2023 వరకే అట్టి విలువ దాటిపోయినందున 2030 వరకు లైఫ్ సైన్సెస్  విలువ  250 మిలియన్ల డాలర్ల రాబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.  హైదరాబాద్ లో 250 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లక్డికాపూల్ నుండి బి.హెచ్.ఇ.ఎల్ వరకు, నాగోల్ నుండి ఎల్బీనగర్  వరకు మెట్రో విస్తరణ చేపట్టేందుకు కేంద్రాన్ని కోరగా ఫీజిబులిటీ లేదని నివేదిక ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులను చేపడుతుందని తెలిపారు. నగరం లో ప్రజా రవాణా కోసం  500 ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకొని వస్తున్నట్లు భవిష్యత్తులో వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి అధునాతన సదుపాయాలు కల్పించడానికి రూ. 2,400 కోట్ల తో లింక్ రోడ్లు, రూ. 10 వేల కోట్లతో మూసీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీ అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్జానంతో ప్రపంచం అబ్బురపడేలా రాచకొండలో ఫిలిం సిటీ, అదేవిధంగా ఒలంపిక్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ ని నిర్మిస్తామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com