తానా మహాసభలకు ధ్యానగురువు దాజీ రాక

- June 03, 2023 , by Maagulf
తానా మహాసభలకు ధ్యానగురువు దాజీ రాక

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ ధ్యాన గురువు, ప్రకృతి ప్రేమికుడు దాజీగా పిలిచే కమలేశ్‌ డి. పటేల్‌ను తానా మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానించారు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని చెప్పే దాజీ హైదరాబాద్‌ కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతి వనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌ గా పేరుపొందిన ఈ ప్రాంతంలో ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం ఉంది. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు.  ధ్యాన గురువుగా ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన ఇటీవలనే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు పద్మభూషణ్‌ ను కూడా అందుకున్నారు. శ్రీరామచంద్రమిషన్‌, హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ వంటి వాటిని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆయన తానా మహాసభలకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com