జగన్‌ ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే లక్ష్యం..

- November 22, 2023 , by Maagulf
జగన్‌ ప్రభుత్వం చేసిన మేలును వివరించడమే లక్ష్యం..

అమరావతి: ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. బుధవారం విశాఖ సౌత్‌, ఒంగోలు, బనగానపల్లెలో బస్సు యాత్రలు చేశారు వైసీపీ ప్రజాప్రతినిధులు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో వివరించారు మంత్రులు, ఎమ్మెల్యేలు.

వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ఏపీలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే, గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన వైసీపీ.. తాజాగా.. సామాజిక సాధికార యాత్ర పేరుతో ఏపీని చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్‌ ఫేజ్‌ బస్సు టూర్‌ కంప్లీట్‌ కాగా.. రెండో విడతలో.. ఇవాళ విశాఖ సౌత్‌, ఒంగోలు, బనగానపల్లె నియోజకవర్గాల్లో వైసీపీ బస్సు యాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన బస్సుయాత్రలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక నేత సీఎం జగన్‌ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

ఒంగోలులో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో మంత్రులు విడదల రజిని, మేరుగు నాగార్జున, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగామ సురేష్‌తోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. దళితులతోపాటు అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న చరిత్ర సీఎం జగన్‌దని కొనియాడారు మంత్రి విడదల రజిని.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగింది. ఈ బస్సుయాత్రను వైవీ సుబ్బారెడ్డి జెండా ఊపి ప్రారంభించగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం, మంత్రులు అమర్నాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాల్‌తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మొత్తంగా.. ఏపీలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది వైసీపీ. బస్సు యాత్ర ద్వారా నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్‌ ప్రభుత్వం చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com