19 మంది పాలస్తీనియన్ల ఉరి

- January 21, 2024 , by Maagulf
19 మంది పాలస్తీనియన్ల ఉరి

గాజా: గాజా నగరంలో డిసెంబరు మాసంలో 19మందిని ఇజ్రాయిల్‌ సైనికులు ఉరి తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహిళలు, బాలికలు ఎంతమందిని వారి కుటుంబాల నుండి వేరు చేశారో లెక్కే లేదని చెప్పారు.

వారిని విచక్షణారహితంగా కొట్టడం, దుస్తులు ఊడదీయడం వంటి అమానుష చర్యలకు పాల్పడేవారని తెలిపారు. ఇజ్రాయిల్‌ సైనికుల దారుణ చర్యలపై మానవ హక్కుల గ్రూపులు సాక్ష్యాలను సేకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 19న ఒక కుటుంబంలో సభ్యులు తాము ఎదుర్కొన్న అకృత్యాలను, దారుణాలను, చూసిన పలు సంఘటనలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ట్యాంకులు, బుల్డోజర్లతో భవనాన్ని చుట్టుముట్టారు, రోజుల తరబడి శతఘ్ని గుళ్లు, క్షిపణులతో దాడులు జరిగాయి.

పరిస్థితి భరించరానిదిగా తయారైందని ఈ ఘర్షణల్లో భర్తను కోల్పోయిన ఉమ్‌ ఒడారు సలేమ్‌ తెలిపారు. తమ ఇంటి తలుపులు బాది మరీ లోపలకు వచ్చి తన భర్తను పట్టుకుపోయారని, తామంతా సామాన్య పౌరులమేనని చెప్పినా వారు వినలేదన్నారు. తర్వాత తనని, తన కుమార్తెలను, ఇతర మహిళలను ఒక గదిలో బంధించి, కత్తులు, తుపాకులతో బెదిరిస్తూ బట్టలూడదీయించారని, అమానుషమైన, అవమానకరమైన మాటలతో తమను సోదా చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ భవనంలో వారు చంపిన 19మందిలో తన భర్త కూడా ఒకరని ఆమె చెప్పారు.

మరణించిన పురుషుల శరీరాల్లో వీపులకు బుల్లెట్లు తగిలిన రంధ్రాలు వీడియో ఫుటేజీలో కనిపిస్తున్నాయి. లండన్‌ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్‌ లా ప్రొఫెసర్‌ అయిన విలియం షాబాస్‌ మాట్లాడుతూ, ఈ ఫుటేజ్‌ అంతా అంతర్జాతీయ న్యాయ స్థానంలో సాక్ష్యాధారాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. 'వారంతా సామాన్య పౌరులని నిరూపించడం ఇక్కడ ముఖ్యం కాదని, పోరాట యోధులను చివరకు వారు తీవ్రవాదులైనా సరే మూకుమ్మడి ఉరి తీయడమంటే అది యుద్ధ నేరం కిందకు వస్తుందని చెప్పాలనుకుంటున్నానని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలన్నింటినీ పకడ్బందీగా అందజేయడంతో సహా ఈ కిరాతకాలకు పాల్పడిన వారి వివరాలను కోర్టుకు సమర్పించడం చాలా అవసరమని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆయుధాలు ప్రయోగించారు, ఎవరు ఆదేశాలు జారీ చేశారు వంటివన్నీ నిరూపించడమే అసలైన సవాలని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com