కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- February 02, 2024
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒకే విడత రూ.2లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కానేకాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దామని, పార్టీ పరంగా తదుపరి కార్యాచరణ అమలు చేద్దామని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో నందినగర్ లోని తన నివాసంలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో బీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలొచ్చాయని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతల ట్రాప్ లో ఎమ్మెల్యేలు పడొద్దని, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎంను మంచి ఉద్దేశంతో కలిసినా తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధికోసం మంత్రులకు ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు అందజేయాలని కేసీఆర్ సూచించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఓట్లేశారు.. కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు స్పష్టత వస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మార్పుకోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యమేనని కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి మరో రెండుమూడు నెలలు గడువు ఇద్దామని, ఆ తరువాతే ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేద్దామని కేసీఆర్ అన్నారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడంతో పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంపై కేసీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్దగా అనుభవం లేదని, పాలనాపరంగా కూడా అనుకున్న ఫలితాలు సాధించడం అంతసులువు కాదని కేసీఆర్ అభిప్రాయ పడ్డారు.
పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలతో మాట్లాడిన గులాబీ బాస్.. కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధికి ఇవ్వాలన్న ప్రతిపాదనలపై ఆరా తీశారు.. ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లోనూ నిరసన చేపట్టాలని ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ భవన్ కేంద్రంగానే అందుబాటులో ఉంటానని చెప్పిన కేసీఆర్.. రాజీలేని పోరాటాలతో తెలంగాణ ప్రయోజనాలను ఒక్క బీఆర్ఎస్ పార్టీనే కాపాడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







