తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..

- April 18, 2024 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..

న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ప్రతీరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని పది రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాల్గో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉంటుంది. ఆ తరువాత మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

  • లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
  • లోక్ సభ అభ్యర్థి రూ. 25వేలు, అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థి రూ. 10వేలు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50శాతం చెల్లిస్తే సరిపోతుంది.
  • నామినేషన్ దాఖలుకు అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు తీసుకురావాలి.
  • లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థులు ఫాం-2ఎ, అసెంబ్లీ అభ్యర్థి ఫాం -2బిలో దరఖాస్తు చేయాలి.
  • అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు.
  • అభ్యర్థి తన నామినేషన్ పత్రాలు నేరుగా కానీ, తన ప్రతిపాదకుడు ద్వారా కానీ సమర్పించవచ్చు.
  • నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.
  • రెండు కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేయడం కుదరదు.
  •  ఫాం -26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. దాని స్టాంప్ పేపర్ విలువ రూ.10లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ- స్టాంప్ కూడా వినియోగించవచ్చు.
  • నామినేషన్ల పత్రాలు దాఖలు ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఊరేగింపులుసైతం సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారులు రికార్డు చేయనున్నారు.
  • అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాటినుంచి అతని ఎన్నికల వ్యయాన్ని అధికారులు లెక్కిస్తారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com