అడోబ్‌ అధిపతి శంతను

- May 27, 2024 , by Maagulf
అడోబ్‌ అధిపతి శంతను

సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లతోపాటు వినిపించే మరో భారతీయ టెక్‌ సీయీవో పేరు శంతను నారాయణ్‌. ప్రపంచ ప్రఖ్యాత ‘అడోబ్‌’ సంస్థకు దశాబ్దకాలంగా సీయీవోగా ఉన్న శంతను ఆ తర్వాత ఛైర్మన్‌గానూ బాధ్యతలు చేపట్టారు. నేడు అడోబ్‌ అధినేత శంతను నారాయణ్‌ పుట్టినరోజు.

శంతను నారాయణ్‌ 1963,మే 27వ తేదీన హైదరాబాద్ నగరంలో జన్మించారు. శంతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, 1984లో అమెరికా వెళ్లి బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ(ఒహైయో)లో కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేశారు.

1986 ప్రాంతంలో ప్రాంగణ నియామకాల్లో తోటివారంతా పేరున్న బహుళజాతి కంపెనీల్లో స్థిరమైన ఉద్యోగాల్లో చేరితే శంతను మాత్రం ‘మెజరెక్స్‌ ఆటోమేషన్‌’ అనే అంకుర సంస్థలో చేరారు. ‘స్టార్టప్‌లో చేరితే నేర్చుకునే అవకాశం బాగా ఉంటుందన్న ఆలోచనతో అందులో చేరాను. నిజంగానే అక్కడ ర్యాపిడ్‌ఫైర్‌ తరహాలో నేర్చుకునే అవకాశం వచ్చింది. ఎక్కువగా ప్రోగ్రామింగ్‌ చేసేవాణ్ని’ అంటారు.

1989లో ‘ఆపిల్‌’ సంస్థలో చేరి అక్కడ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఆరేళ్లు పనిచేశారు శంతను. అక్కడ ‘ఆపిల్‌ టాక్‌’ పైన పనిచేసిన ‘గుర్‌శరణ్‌ సింగ్‌ సంధు’ రూపంలో తనకు మంచి మార్గదర్శి దొరికారంటారాయన. ‘ఎదుటివారికే కాదు, మనకు మనం కూడా ఎప్పుడూ సవాళ్లు విసురుకుంటుండాలి’ అన్న సంధూ మాటలు తన కెరీర్‌ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడ్డాయని చెబుతారు.

కెరీర్‌ ఎదుగుదలకు తనలోని మేనేజర్‌నీ, వ్యాపారినీ మెరుగుపర్చుకోవాలనుకున్న శంతను... ఆపిల్‌లో పనిచేస్తూ వారాంతాల్లో క్లాసులకు హాజరవుతూ కాలిఫోర్నియాలోని ‘హాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ నుంచి ఎంబీఏ చేశారు. ఆపిల్‌ తర్వాత ‘సిలికాన్‌ గ్రాఫిక్స్‌’ అనే సంస్థలో ‘డెస్క్‌టాప్‌ అండ్‌ కొలాబరేషన్‌ ప్రొడక్ట్స్‌’ డైరెక్టర్‌గా ఏడాదిపాటు పనిచేశారు.

1995 ప్రాంతంలో సిలికాన్‌ వ్యాలీలో ఇంటర్నెట్‌ బూమ్‌ వచ్చింది. పెట్టుబడి సంస్థ ప్రాంగణంలో చెట్టుని వూపినా కంపెనీ పెట్టడానికి డబ్బు వస్తుందన్నట్లు ఉండేది పరిస్థితి. అందరూ ఇంటర్నెట్‌ ఆధారిత అంకుర సంస్థలవైపు అడుగులు వేసేవారు. ఇంటర్నెట్‌లో ఫొటోలు షేర్‌చేసుకునే కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుందని వూహించి కొద్దిమందితో కలిసి ‘పిక్ట్రా’ పేరుతో 1996లోనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు శంతను. ఫొటో షేరింగ్‌ కాన్సెప్ట్‌లో వచ్చిన మొదటి వెబ్‌సైట్‌ అది. దీంతోపాటు ఫొటోగ్రఫీ రంగంలో డిజిటల్‌ వైపు వచ్చే కంపెనీలకు అవసరమైన సేవల్నీ అందించేదీ సంస్థ.

‘ఒక సంస్థను ప్రారంభించడం నిజంగా గొప్ప అనుభవం. కానీ పిక్ట్రా ఎదుగుదలకు సకాలంలో నిధులు రాబట్టలేకపోయాం. మా వ్యాపార విధానంలోనూ లోపాలు ఉండటంతో ఆ జర్నీ అనుకున్నంత విజయవంతం కాలేదు. కానీ ఆ అనుభవంతో నేనెంతో నేర్చుకున్నాను. దూరదృష్టితో ఆలోచించడం, వ్యాపారాన్ని భారీస్థాయిలో వూహించడం, అనుకోని అడ్డంకులను అధిగమించడం... లాంటి అంశాలు తెలిశాయి. ఏటికి ఎదురీదడం అనుభవమైంది’ అని చెబుతారు శంతను.

ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసిన సంస్థే ‘అడోబ్‌’. ఫొటోషాప్‌... ఒక సాఫ్ట్‌వేర్‌గా కాకుండా ఒక క్రియగా మారిపోయి ప్రజల్లోకి వెళ్లిందంటే కంపెనీ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 1982లో ప్రారంభించిన ఈ సంస్థలో 1998లో అడుగుపెట్టారు శంతను. ప్రారంభంలో ‘ఇంజినీరింగ్‌ టెక్నాలజీ గ్రూప్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అడోబ్‌లో పనిచేస్తూ ప్రచురణ రంగంలో, మీడియా రంగంలో మేం తేబోతున్న భారీ మార్పుల్ని చాలా ముందుగానే వూహించాను’ అని చెప్పే శంతను నాయకత్వ నిచ్చెనలో త్వరత్వరగా పైకివెళ్తూ 2005లో కంపెనీ ‘చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌’గా, 2007లో సంస్థ సీయీవోగా బాధ్యతలు చేపట్టారు.

రూ.20వేల కోట్లతో ఫ్లాష్‌ను అభివృద్ధి చేసిన ‘మ్యాక్రోమీడియా’ను 2005లో, రూ.11వేల కోట్లతో డిజిటల్‌ మార్కెటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ‘ఓమ్నీట్రూ’ను 2009లో అడోబ్‌ చేజిక్కించుకోవడంలో శంతనూ కీలకపాత్ర పోషించారు. 2008 వరకూ ఆదాయంలో స్థిరమైన పెరుగుదలతో వచ్చిన అడోబ్‌... ఆర్థిక మాంద్యం కారణంగా 2009లో 18 శాతం క్షీణతను చూసింది. తర్వాత ఏడాది కొంత వరకూ నష్టాల్ని తగ్గించుకొని 2011 నుంచి మళ్లీ లాభాలబాట పట్టింది.

2011లో అడోబ్‌ ఉత్పత్తుల్ని క్లౌడ్‌ ఆధారంగా అందించాలని నిర్ణయించారు శంతను. ఆ సేవల్లో... డాక్యుమెంట్‌ క్లౌడ్‌ (డాక్యుమెంట్ల రూపకల్పన, వినియోగం), క్రియేటివ్‌ క్లౌడ్‌(డిజైనింగ్‌ చేసేవారికి), ఎక్స్‌పీరియన్స్‌ క్లౌడ్‌(ఖాతాదారుల ఆన్‌లైన్‌ కదలికల్ని పర్యవేక్షించేందుకు)లు ఉన్నాయి. అడోబ్‌ చరిత్రలోనే అతిపెద్ద మార్పు అది. ‘యథాస్థితిని కొనసాగించడమే మీ వ్యాపార వ్యూహమైతే, అది సరైన వ్యూహం కాదు’ అంటారు శంతను.

ఫొటోషాప్‌, ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో లాంటి ఆప్స్‌ మొబైల్‌లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. వీరి ‘ప్రీమియర్‌ ప్రో’ టెక్నాలజీద్వారా సినిమాల్ని ఎడిట్‌ చేసుకోవచ్చు. సృజనాత్మక రంగంలో ఉన్నవారిలో 90 శాతం ఫొటోషాప్‌ని వాడుతున్నారంటే దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘ప్రపంచం డిజిటల్‌ వైపు వెళ్లేకొద్దీ మా ప్రగతీ బాగుంటుంది. డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ షేరింగ్‌, వెబ్‌ ఆధారిత కమ్యునికేషన్స్‌లో మేం ఇప్పటికే ముందున్నాం’ అని చెబుతారు శంతను.

2016లో అడోబ్‌ ఆదాయం 22శాతం పెరిగి రూ.40 వేల కోట్లకు చేరింది. దీన్లో క్లౌడ్‌ సేవల నుంచే ఎక్కువ మొత్తం వచ్చింది.తన హయాంలో ఎన్నో కొత్త ఉత్పత్తులతో, పాతవాటికి అప్‌డేట్‌లు తెస్తూ మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. 2017, ఫిబ్రవరిలో కంపెనీ బోర్డు శంతనుకు సంస్థ ఛైర్మన్‌గా పదోన్నతి కల్పించింది.

హోదా, డబ్బుకంటే ఇష్టమైన పనికే ఓటు వేశాను. ఎంబీఏ తర్వాత చాలామంది తయారీరంగంలోకి వెళ్తే లాభం ఉంటుందని చెప్పేవారు. నేను మాత్రం నా మనసుకు నచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే ఉన్నాను. ఇక్కడ కెరీర్‌ ప్రారంభంలోనే ఎంతో మంది అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను, వారితో పనిచేశాను. ‘మనం మాత్రమే ఏం చేయగలం, ఎంత వరకూ చేరుకోగలం లాంటి మాటలు వారి దగ్గర వినిపించవు. ఆపిల్‌లో అయితే ‘మనం ప్రపంచాన్ని మార్చుతున్నాం’ అన్న ఏకైక ఆలోచనతో పనిచేసేవాళ్లం. నేను అభివృద్ధిచేసిన ఉత్పత్తిని కోట్ల మంది వినియోగిస్తారన్న ఆలోచనే గొప్పగా ఉండేది’ అని చెబుతారు . 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com