మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..

- June 16, 2024 , by Maagulf
మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..

అమరావతి: మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్ లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, CRDA కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం అతిముఖ్యమైనది.. వేగంగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. రాజధాని 217 చదరపు కిలో మీటర్ల మేర ఉంది. 48వేల కోట్లతో టెండర్లు వేశాం. 9వేల కోట్లు పేమెంట్ కూడా చేశామని చెప్పారు.

అన్ని జిల్లాలకు ఉపయోగపడేలా రాజధాని ఆర్థికంగా పెరగాలని భావించాం. సింగపూర్ సహకారం తీసుకున్నాం. నార్మన్ పాస్టర్స్ డిజైన్ చేశారు. అదే మాస్టర్ ప్లాన్ తో రాజధాని నిర్మిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. షీర్ వాల్ టెక్నాలజీతో మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు, ఐఏఎస్, ఐపిఎస్ క్వాటర్స్ నిర్మించాం. 90శాతం పూర్తయ్యాయి. 2015 జనవరి 1వ తేదీన రైతులను భూమి ఇవ్వమని కోరాం. ఫిబ్రవరిలోనే 34వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చారు. రైతులు త్యాగం చేశారని నారాయణ కొనియాడారు. అయితే, గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాజధానిని నాశనం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత అనుభవంతో ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒక రాజధాని నిర్మాణం చేస్తాం. అనేక దేశవిదేశాలు తిరిగి రాజధాని డిజైన్ చేశాం. రెండున్నర సంవత్సరాల్లో ఈ నిర్మాణాలు పూర్తిచేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. టైం బౌండ్ తో పూర్తిచేస్తాం. 48వేల కోట్లు ఫేజ్ -1 పనులు ఎస్టిమేట్ చేశామని తెలిపారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లపై రివ్యూ చేసి, సీఎంతో చెప్పి ప్రారంభించే తేదీ ఫిక్స్ చేస్తామని నారాయణ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com