సినిమా రివ్యూ: ‘ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’

- September 05, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’

ఇళయ దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే ‘ది గోట్’. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. కానీ, ఆశించిన రేంజ్‌లో బజ్ అయితే క్రియేట్ కాలేదు. కానీ, తమిళనాట ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయ్. అందుకు కారణం విజయ్ చివరి సినిమాగా ఈ సినిమాని పరిగణిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో‌కి రావాలనుకుంటున్నాడనీ,. సినిమాలకు దూరం కానున్నాడన్న ప్రచారమే. అయితే, ఆఖరి సినిమాగా రూపొందిన ‘ది గోట్’ అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో కీలక వ్యక్తి అయిన గాంధీ ఓ ఆపరేషన్ నిమిత్తం భార్య (స్నేహ), కొడుకు జీవన్ (చిన్నప్పటి విజయ్ డబుల్ రోల్)తో థాయ్‌లాండ్ వెళతాడు. ఆ టూర్‌లో అనుకోకుండా తన కొడుకును మిస్ అవుతాడు. తన కారణంగానే కొడుకు మిస్ అయ్యాడని భావించిన గాంధీ తనకు తాను శిక్ష విధించుకుంటాడు. స్వ్కాడ్ నుంచి తప్పుకుంటాడు.  దాదాపు 15 ఏళ్ల తర్వాత మాస్కోలో చిన్నప్పుడు తప్పిపోయిన తన కొడుకును చూసి ఇండియాకి తీసుకొస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు అంతా సంతోషంగా వుందనుకున్న టైమ్‌లో తనకెంతో ఇష్టమైన వ్యక్తి గాంధీ కళ్ల ముందే చనిపోతాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా గాంధీకి దగ్గరైన వ్యక్తులంతా చనిపోతుంటారు. వాళ్లని చంపుతున్నదెవరు.? చివరికి తన వరకూ వచ్చిన చావు, అసలు గాంధీని చంపాలనుకున్నదెవరు.? పగ, ప్రతీకారం.. సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటీ.? తెలియాలంటే ‘ది గోట్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
విజయ్ ఈ సినిమాలో డబుల్ రోల్‌లో నటించాడు. కొడుకు కోసం తప్పించే తండ్రిగా, తండ్రిపై పగతో రగిలిపోయే కొడుకులా పాజిటివ్ అండ్ నెగిటివ్.. రెండు షేడ్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో డీ ఏజింగ్ టెక్నాలజీతో విజయ్‌ని యంగ్ లుక్స్‌లో చూపించడం ప్రత్యేకత. ఈ లుక్‌పై సినిమా రిలీజ్‌కి ముందు చాలా ట్రోల్స్ జరిగాయ్. కానీ, సినిమాలో ఆ లుక్ ఏమంత ట్రోల్ చేసేలా అనిపించదు. అలాగే, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) సహాయంతో సీనియర్ నటుడు విజయ్ కాంత్‌‌ని రీ క్రియేట్ చేయడం వంటివి మెచ్చుకోదగ్గగ అంశాలు. స్నేహ పాత్రకు ఎక్కువే ఇంపార్టెన్స్ వుంది. తనకున్న పరిధిలో ఆమె పాత్ర రక్తి కట్టింది. అలాగే యాంటీ స్క్వాడ్ స్పెషల్ ఆఫీసర్ పాత్రలో జయరామ్ తన పాత్ర పరిధి మేర నటించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు ఓకే. అన్నట్లు అదే స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ ఏజెంట్లుగా పని చేసిన ప్రభుదేవా, సీనియర్ నటుడు ప్రశాంత్, అజ్మల్ పాత్రలు సినిమాకి ఏమంత యూజ్ కాలేదు. వీళ్లందరికీ బాస్ క్యారెక్టర్ పోషించిన జయరామ్ పాత్ర కూడా అంతే. సోసోగా కనిపించి చనిపోవడంతో మధ్యలోనే కట్ అయిపోయింది.

సాంకేతిక వర్గం పనితీరు:
విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకట్ ప్రభు ఏం చెప్పి విజయ్‌ని ఈ సినిమాకి ఒప్పించారో తెలీదు కానీ, ఈ సినిమాకి ప్రమోషన్ చేసినంత సీను లేదని ఆడియన్స్ తేల్చేశారు. చాలా రొటీన్ రొట్ట కొట్టుడు కాన్సెప్ట్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కి సంబంధించి తెరకెక్కిన సన్నివేశాల్లో ఎక్కడా కొత్తదనం కనిపించదు. విజయ్ గతంలో నటించిన ‘తుపాకీ’ తదితర సినిమాల్లో ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్కీన్‌ప్లే ఈ సినిమాలో టైటిల్‌కి యాప్ట్ కోసమైనా ఇంచు కూడా కనిపించదు. అక్కడక్కడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయ్. గాంధీ, నెహ్రూ, బోస్ ప్యాటర్న్‌లోని ఓ కామెడీ ట్రాక్ దారుణంగా ఫెయిలైంది. త్రిషతో స్పెషల్ సాంగ్ జస్ట్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక, వెంకట్ ప్రభు టేకింగ్ అయితే, కంప్లీట్ ఫెయిలైందనీ విమర్శకుల అభిప్రాయం. చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై ఎంత ఫోకస్డ్‌గా వుండి వుండాలి. కానీ, ఆ ఫోకస్ ఎక్కడా కనిపించదు. తరువాతి సీను ప్రేక్షకుడి అంచనాకి ఈజీగా అందేలా వుంటుంది. అలాగే స్పెషల్ స్క్వాడ్‌కి సంబంధించిన ఏ సన్నివేశమూ ఎఫెక్టివ్‌గా అనిపించదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమాని ఏ రేంజ్‌లోనూ నిలబెట్టలేకపోవడం ఆశ్చర్యకరం. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్‌కి చాలానే పదును పెట్టాల్పి వుంది.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌, సెకండాఫ్ కలిపి అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్, కొడుకే విలన్ అన్న సంగతి రివీల్ అయిన ఇంటర్వెల్ బ్యాంగ్.. మెట్రో ట్రైన్‌లో తీసిన ఫైట్ సీక్వెన్స్.. విలన్‌గా విజయ్ మేనరిజమ్ కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది అలాగే ఆయన స్టైల్‌లో కొన్ని పంచ్ డైలాగులు బాగున్నాయ్.

మైనస్ పాయింట్స్:
గతంలో చాలా సినిమాల్లో చూసేసిన పాత కథే, అది కూడా ఎక్కడికక్కడ సాగతీత సన్నివేశాలు, రొటీన్ రొట్ట కొట్టుడు స్క్రీన్‌ప్లే, అస్సలు కొత్తనం లేని కథనం, బోర్ కొట్టించేలా పాటలు, వీక్ బీజీఎమ్..

చివరిగా:
ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)  పేరులో వున్న గ్రేట్‌నెస్ సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com