మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే సహించం: సీఎం రేవంత్
- October 21, 2024
హైదరాబాద్: శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసులకు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.మతాలకు సంబంధించిన అంశాల్లో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే వారిని కూడా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమర పోలీసు కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా ప్రగతి పథంవైపు నడవాలంటే శాంతి భద్రతలు పరిరక్షణ అత్యంత కీలకమని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాగే ఎవరో తప్పు చేశారని, వాళ్లను తామే శిక్షిస్తామని కొందరు శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో తప్పు చేసిన వారికి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్న వారికి మధ్య తేడా లేకుండా పోతుంది. తప్పు చేసే వారెవరైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి.శాంతి భద్రతలు, మత సామరస్యం కాపాడబడినప్పుడే మన పండుగలను గొప్పగా నిర్వహించుకోగలం.
కొన్ని సందర్భాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేనప్పటికీ పోలీసులు హైదరాబాద్ నగరంలో మతసామరస్యాన్ని కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారు. బాధితుల విషయంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలే తప్ప క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పోలీసు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైనప్పుడు, అమరులైనా లేదా అంగవైకల్యం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం పెంచుతున్నాం.
పోలీసు శాఖ, సిబ్బంది పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. పోలీసులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. మరొకరు చులకనగా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు. సమాజంలో అందరికీ రక్షణ కల్పించే పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. కొత్త కొత్త రూపాల్లో జరుగుతున్న నేరాలను అరికట్టడంలో గతంలో ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి.
హోం గార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభిస్తున్నాం. ఎలాంటి లోటురాకుండా పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!