అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
- December 09, 2024
లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ చట్టరీత్యా నేరాలే.. లంచాన్ని సామాన్యంగా కాని పనులు చేయించుకునే విధంగా ప్రభుత్వ అధికారుల్ని, పదవులలో ఉన్నవారిని ఒప్పించి పనులు చేయించుకుంటూ ఉంటారు, అసలు లంచం ఏ రూపంలో జరిగినా కూడా అది నేరంగానే పరిగణిస్తారు. లంచం డబ్బుల రూపంలోనో, లేదా వస్తువు రూపంలోనో పొందుతూ ఉంటారు. ఇది నేరమని తెలిసీ చేసే వారు ఉన్నారు. అధిక ఆశ, పదవీ వ్యామోహం, కూడబెట్టుకోవాలనే కాంక్ష వల్ల ఇలా జరుగుతుంది. అధికారులు ఇంకా కూడబెట్టాలని, బీదవారు పనులు త్వరగా చేయించుకోవాలని సాగే దందాకు మనం పెట్టుకున్న పేరు లంచం, అవినీతి. ఇది మనిషి విలువలను పతనానికి తొక్కేస్తుంది. మనిషిగా ఉండవలసిన నీతిని వదిలి, ఆశతో చేసే తప్పు అవినీతి పరునిగా సంఘంలో నిలబెడుతుంది.
అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమాజంలో కాస్తన్నా మార్పురావాలనే ఆలోచనతో జరుపుకునే రోజు ఇది. అవినీతి చిన్నగా మొదలై ఏడు తలల విషనాగులా మారిపోయింది. ఒక్క భారత దేశంలోనే అవినీతి పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నంత అవినీతి మరెక్కడా లేదు. అవినీతి అడ్రస్ రాజకీయాలే. ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కనీస మౌలిక వసతులు కూడా ఇవ్వకుండా రోజు రోజుకూ బీదవారిగా మార్చేస్తుంది.
గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ దేశాల నుంచి విదేశాల వరకూ అన్ని చోట్లా అవినీతి పంజా విసురుతూనే ఉంది. అవినీతి వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దీనితో నేరాలు పెరుగుతున్నాయి. ఉన్నవాడిని కొట్టి బీదవాడు బీదవాడిని కొట్టి ఇంకా బీదవాడు అవినీతిలో బ్రతుకుతున్నారు. బీదరికంలో ఉన్న దేశాలలో అవినీతి తక్కువగానే ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలలోఅవినీతి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకప్పుడు లంచం తీసుకోవడాన్ని అడ్డుకునే జనం మొన్నటి ఎన్నికల్లో జనం ఏ పార్టీ ఎక్కువ ముట్టజెప్పుతుందో ఆ పార్టీకి మాత్రమే ఒటు వేస్తామని పబ్లిగ్గా ప్రకటించింది. మరి పార్టీలు కూడా గెలిచాకా ప్రజలకు కష్టపడి సంపాదించుకునే విధానాన్ని మార్చి ఉచితాలను ఇచ్చేస్తుంది. దీనితో ఉచితాలకు అలవాటు పడుతున్నారు జనం. ఇంతటి తెగింపుకు రావడానికి భారతదేశంలో పెరిగిపోతున్న అవినీతి మాత్రమే కారణం. ఒక ఉద్యోగం కొన్న ఉద్యోగి, లంచంతో పని జరిపించుకున్న సామాన్యడు ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కును కాలరాసి అవినీతి వైపు మొగ్గుచూపుతూనే ఉన్నారు. అదే హక్కుగా భావిస్తున్నారు.
అవినీతి లేని దేశం, రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అవినీతి అంతగా ప్రపంచమంతా వ్యాప్తిచెందింది. ప్రతి వ్యవస్థ అవినీతి మయం అవడం వల్ల పేదవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వారి స్థితిగతులను ఈ చర్యలు మార్చేస్తున్నాయి. అంతేకాదు, సమాజ ప్రమాణాలు దిగజారీపోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వాలు, ఎన్జీవోలు.. ఇలా అందరూ చేతులు కలిపి అవినీతిపై ప్రజలకు అవగాహాన కల్పించి, దానిని అరికట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ ప్రజల అవసరాల ముందు పనికి రావడం లేదు.
అవినీతి, లంచగొండితనం అధికంగా వ్యాపించిన భారత దేశంలో నీతివంతమైన సమాజం మాయమైపోయింది. దేశ ప్రగతి నిరోధకంగా అవినీతి చెదలు నిలుస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న అధిక జనాభా, నిరుద్యోగం, అవిద్య, వాతావరణ కాలుష్యం, పేదరికం లాంటి సమస్యలకు అవినీతి కారణం అవుతున్నది. ప్రభుత్వ పథకాలు బడుగులకు చేరేసరికి బక్కచిక్కిపోతు న్నాయి. అవినీతి వ్యతిరేక చట్టాలు మూలన పడి మూలుగుతు న్నాయి.
వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అందరికీ అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. చేతులు తడపందే ఫైలు కదలనంటోంది. తూకంలో మోసాలు, నకిలీ సామాన్లు, పన్ను ఎగవేతలు, కల్తీ లీలలు, ఆన్‌లైన్ మోసాలు లాంటివి సామాజిక ఆరోగ్యానికి పట్టిన తెగులుగా అవతరించాయి. అవినీతికి వ్యతిరేకంగా ఏకమవుతూ పోరుబాట పడదాం. నైతికత, పారదర్శకత, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం, జవాబుదారీతనం, అంకిత భావం పెరగాలి. నీతివంతమైన భారత నిర్మాణానికి మనందరం పూనుకుందాం, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనుదాం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి