దారుణంగా పతనమైన రూపాయి విలువ

- December 19, 2024 , by Maagulf
దారుణంగా పతనమైన రూపాయి విలువ

న్యూ ఢిల్లీ: రోజురోజుకు రూపాయి మారకం విలువ పడిపోతూ వున్నది. నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. బలహీన మూలధన ప్రవాహాలకు తోడు ఇతర ఆర్థిక సవాళ్ల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కరెన్సీపై ఇది అదనపు భారాన్ని మోపింది.

మరింతగా దిగజారిన మారకం విలువ
డాలర్‌తో పోలిస్తే బుధవారం రూపాయి మారకం విలువ రూ. 84.9525కు పడిపోగా, గురువారం మరింత క్షీణించి రూ. 85.0650కు దిగజారింది. రెండు నెలల్లోనే రూపాయి మారకం విలువ రూ. 84 నుంచి 85కు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో రూ. 83 నుంచి రూ. 84కు క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అంతకుముందు రూ. 82 నుంచి రూ. 83కు పతనం కావడానికి 10 నెలల సమయం పట్టగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే రూ. 84 నుంచి రూ. 85కు పడిపోయింది.

ఇతర దేశాల్లో కూడా పతనం
అయితే, భారత కరెన్సీ ఒక్కటే కాదు, ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీ కూడా గురువారం భారీగా పతనమైంది. కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియన్ రుపయా 0.8 శాతం నుంచి 1.2 శాతం క్షీణించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com