అభ్యుదయ కథా వైతాళికుడు - చాసో

- January 15, 2025 , by Maagulf
అభ్యుదయ కథా వైతాళికుడు - చాసో

కథకులకు కథడుడిగా పేరుపొందిన కథకుడు చాసో. రాసిన కథలు తక్కువైనా వాటిలోని వస్తువు, శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అందరికీ సామాన్యంగా అనిపించే దృశ్యంలోంచి అసమాన్యమైన కథను సృష్టించడంలో చాసో అసమాన్యుడు. ఏది రాసినా, ఏది చెప్పినా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక సన్నివేశంలోనే మనిషి జీవితాన్ని వ్యాఖ్యానించేలా కథను రాయగల ప్రతిభ వారిది. ఈయన బాణి మన కథకుల్లో విశిష్ఠమైంది. సామాజిక ప్రయోజనం లేనిది కథ రాయడం వృధా అంటారు వారు. జీవితం చివరి వరకూ అభ్యుదయవాదిగానే నిలబడిన వాస్తవిక వాది చాసో. నేడు అభ్యుదయ కథా వైతాళికుడు చాసో జయంతి. 

చాసో అసలు పేరు చాగంటి సోమయాజులు. 1915, జనవరి 17న శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మలకు జన్మించారు. పుట్టంది శ్రీకాకుళం అయితే వారి పెద్దతల్లి దత్తత తీసుకోవడం వల్ల చిన్నప్పుడే విజయనగరం వచ్చేశారు. ఎక్కువ రోజులు అక్కడే నివశించారు. కాదంబరి అన్నపూర్ణతో 13 ఏటనే వివాహం జరిగింది. బి.ఎ. రెండో సంవత్సరం చదువుతుండగానే చదువు ఆపేసి చిన్నాజీ కథలను ముద్రించారు. అయితే కళాశాలలో చదివే రోజుల్లో కవిత్వం కూడా రాసేవారు. కానీ ఆ తర్వాత కథలవైపే మొగ్గు చూపి ఆణిముత్యాల్లాంటి కథలను మనకు అందించారు. వీరికి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర లాంటి కవులు బాగా సన్నిహితులు. విజయనగంలోని హవేలీ భవనం వీరి సాహిత్యాభిమానానికి నిలయం. వీరి మొదటి కథ చిన్నాజీ 1942లో భారతిలో ముద్రితమైంది. 

వాయులీనం, ఎంపు, పరబ్రహ్మం, దుమ్మలగొండె, కుక్కుటేశ్వరము, లేడీ కరుణాకరం, బండపాటు, కుంకుడాకు, భల్లూకస్వప్నం, పోనీ తిను, బుగ్గిబూడిదమ్మ కథ... ఇలా సుమారు నలభైకి పైగా కథలు రాశారు చాసో. లేడీ కరుణాకరం  కథలో- శారద, భర్త చదువుకోసం వ్యభిచారిణిగా మారినట్లు చెప్తుంది. ఇందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కొంత ఉంటుంది. చివరికి భర్తకూడా ఇదంతా నీ భిక్షమే అంటాడు. చాసో ఆమెను మహాపతివ్రత అంటాడు. ఈ కథంతా వ్యంగ్యంగా సాగుతుంది. 

ఎంపు కథలో - ఓ బిచ్చగాడి కూతురు మరో బిచ్చగాడిని ప్రేమిస్తుంది. కానీ తండ్రి ఇంకో బిచ్చగాడి సంబంధం తెస్తాడు. వీరిద్దరిలో  పెళ్లికొడుకును ఎంపిక చేసుకోవడమే ఈ కథలోని వస్తువు. వాయులీనం కథలో- భార్యాభర్తల అన్యోన్యత, ఆర్థికబంధాలు కనిపిస్తాయి. కుంకుడాకు కథలో- వంటకోసం ఎండుటాకులు ఏరుకునే అమ్మాయికి ఎదురైన సంఘటనను చెప్పారు. పరబ్రహ్మం కథలో- పిచ్చివాడిగా చెలామణి అవుతున్న విద్యావంతుడి ప్రతిభను వర్ణించారు. బదిలీ కథ- కేవలం ఉత్తరాలతో నడిచే కథాశిల్పానికి మంచి ఉదాహరణ. అందుకే వీరు రాసిన ఏ కథకు మరో కథతో సామ్యం అంటూ ఉండదు.   

చాసో కథలు హిందీ, రష్యన్, కన్నడం, మరాఠీ, మలయాళం, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. చాసో అవసరాన్ని మించిన వర్ణనలు చేయడు. పాఠకుడ్ని నేరుగా కథలోకి తీసుకెళ్తాడు. ఇతివృత్తం, స్పష్టత, కథనంలో సంక్షిప్తత, సహజత్వం, కళాత్మకత వీరి కథకున్న లక్షణాలని చెప్పాలి.  వీరి మొదటి కథా సంపుటి 1968లో వచ్చింది. తర్వాత వీరి 70వ జన్మదినం సందర్బంగా మరికొన్ని రచనలు ప్రచురించారు. వీరి కథలను విశాలాంధ్రవాళ్లు సంపుటిగా తీసుకొచ్చారు. చాసో గురించి జననీరాజనం, కథాశిల్పి చాసో అనే ప్రసిద్ధ రచనలు వచ్చాయి. అసలు చాసో  రచనలపై టాల్ స్టాయ్, గోర్కీ రచనల ఫ్రభావం ఉందంటారు విమర్శకులు. అలానే మార్క్సిజాన్ని అభిమానించే చాసో పీడిత వర్గపక్షపాతిగానే రచనలు చేశారు. కానీ ఎక్కడా సిద్ధాంతాన్ని రచనల్లో చొప్పించినట్లు కనపడదు.           

వర్తమాన సమాజంలో వైరుద్ధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలలో, మనిషి మనుగడలో కీలకపాత్ర నిర్వహిస్తాయనే సత్యాన్ని అలవోకగా ‘కాందిశీకుడు’ కవిత( రచనాకాలం: 1937-40) ఆవిష్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్‌ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించాడు. ‘నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని’, చివరికి ‘పొయి లో నిప్పులేదు, నీకేం పెట్టేది నా నాయనా’ అనే తల్లి విలాపం పఠితను కన్నీళ్ళు పెట్టిస్తుంది. 

చాసోకు ప్రకృతిని చూస్తూ ఆనందించడమంటే చాలా ఇష్టం. చీకటి చిరు వెలుగుల మధ్య, కొబ్బరి చెట్ల నీడలనీ, అరటి చెట్ల నీడలనీ, దట్టమైన రంగుల్నీ, గాలికి కదలాడే ఆ నీడల అందాలని చూస్తూ చుట్టకాల్చుకోవడం చాసోకు మహా ఇష్టం.చాసోలోని వస్తువు, శిల్పం ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి. అందుకే చాసోను తెలుగువారి చెఖోవ్ అంటారు. కథ రచన చేసే వాళ్లకు వారి కథలు పాఠాలవంటివి.

అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు. 1994, జనవరి 1న తన 70వ ఏట మద్రాసులో ఉండగా గొంతు క్యాన్సర్ వచ్చి చాసో మరణించారు. మరణానంతరం తన భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం. 

చాసో గారి పెద్దకూతురు తులసి తన తండ్రి పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి కథను అభ్యుదయ పంథాలో ముందుకు తీసుకెళ్తున్న వారికి చాసో పేరిట ప్రతి ఏడాది అవార్డు ప్రధానం చేస్తున్నారు. ప్రముఖ విమర్శకులు శ్రీకాంతశర్మ అన్నట్లు- ఒక సన్నివేశానికి వుండే వివిధ కోణాలను పోల్చి, ఏ కొసనుంచి ప్రారంభిస్తే అది ఒక జీవన సూత్రానికి వ్యాఖ్యాప్రాయంగా వుంటుందో గ్రహించ గలిగేవాడే గొప్ప రచయిత. అటువంటి అపురూప లక్షణంగల గొప్ప కథా రచయిత చాసో.


- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com