6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- May 31, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్, ఐపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా డీజీపీ పరిధిలోని అన్ని విభాగాల సబ్ఇన్స్పెక్టర్లు (ఎస్ఐలు) మరియు అంతకంటే పైస్థాయి అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 6,500 మంది అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు శాఖపై ఉన్న అంచనాలు, ప్రజల అవసరాలు మరియు మారుతున్న నేరాల స్వరూపంపై డీజీపీ విస్తృతంగా చర్చించారు. గతంలో మావోయిస్టు సమస్యలు, సాధారణ నేరాల నియంత్రణపై దృష్టి సారించిన పోలీసు శాఖ, ప్రస్తుతం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నార్కోటిక్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మార్పులకు అనుగుణంగా అధికారుల ఆలోచనా విధానం, పనితీరు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్త ప్రత్యేక విభాగాల ఏర్పాటు
ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా:
- ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత కోసం ప్రత్యేక ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగం
- ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంపొందించేందుకు టెక్ టీమ్
- ప్రభుత్వ ఆదాయ నష్టాలను అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్
- రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నేపథ్యంలో ఆహార కల్తీని నిరోధించేందుకు యాంటీ ఫుడ్ అడల్టరేషన్ విభాగం
ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఎస్పీలు, కమిషనర్లకు కీలక సూచనలు
జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు తమ యూనిట్లకు సమర్థ నాయకులుగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. నేర సమీక్ష సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం, పోలీస్ స్టేషన్లు మరియు ఇతర యూనిట్లను తనిఖీ చేయడం, రాత్రి గస్తీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం, డయల్-112 కాల్స్‌కు వేగవంతంగా స్పందించడం వంటి ప్రాథమిక పోలీసింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రజలతో ప్రత్యక్ష భేటీలకు ప్రత్యేక సమయం
సమాజ పోలీసింగ్‌ను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోలీసు అధికారులను నేరుగా కలిసేలా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని సూచించారు.
నిజాయితీ, పారదర్శకతకు ప్రాధాన్యం
తమ యూనిట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తూ అత్యున్నత స్థాయి నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువలను కాపాడాలని అధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. సమగ్రత (ఇంటిగ్రిటీ) లేకుండా చేసే కృషి ఫలవంతం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎస్హెచ్ఓల పాత్ర కీలకం
పోలీస్ శాఖ విజయాపజయాలను నిర్ణయించడంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓలు) కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్న డీజీపీ, వారి విధులు, బాధ్యతలను వివరించారు. అలాగే ఎస్హెచ్ఓలు కాని ఎస్ఐలు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు వంటి పర్యవేక్షణ అధికారుల బాధ్యతలపై కూడా మార్గనిర్దేశం చేశారు.
సమావేశం ముగింపులో రాష్ట్ర పోలీసు బలగమంతటికీ ఒకేసారి తన ఆలోచనలు, లక్ష్యాలు, కార్యాచరణ దిశను చేరవేయగలిగినందుకు ఈ సమావేశం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







