వెండితెర నవ్వుల నజరానా-ఇ.వి.వి

- January 21, 2025 , by Maagulf
వెండితెర నవ్వుల నజరానా-ఇ.వి.వి

 “నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల విందు అందించాలన్న సత్సంకల్పంతోనే ‘విజయా’వారు సినిమాలు తీశారు. ‘విజయా’వారి చిత్రాల్లోని పాటల మకుటాలతోనే సినిమాలు తీసి అలరించారు దర్శక రచయిత జంధ్యాల. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది. నేడు టాలీవుడ్ దర్శక దిగ్గజం ఇ.వి.వి. సత్యనారాయణ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన సినీప్రస్థానం గురించి ప్రత్యేక కథనం మీకోసం..  

ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ1956, జూన్ 10న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన ఈదర వెంకటరావు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. చిన్నపట్నుంచే సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను మిత్రులతో చర్చిస్తూ సాగారు ఇ.వి.వి. సినిమాల పిచ్చి ముదరడంతో ఇంటర్మీడియట్ ముందుకు సాగలేదు. ఇలా కాదని పెద్దవాళ్లు పెళ్ళి కూడా చేసేశారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. అయినా సినిమాపై ఆకర్షణ ఏ మాత్రం సన్నగిల్లలేదు. తన  భార్యకు తన మనసులోని మాటను చెప్పి నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడు తన మిత్రుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మద్రాస్ బయలుదేరారు. 

మద్రాస్ నగరంలో నవతా కృష్ణంరాజు గారిని కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పారు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవారు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవారు. ప్రతి ఉదయం నవతా కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని ఆయన అడగ్గా, సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఇ.వి.విని దేవదాస్ కనకాల క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించారు. త‌న‌వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌నిచేసే వారంద‌రికీ అన్ని విష‌యాలు క్షుణ్ణంగా చెప్పేవారు దేవ‌దాస్‌. పైగా ఆయ‌న మంచి న‌టుడు కూడా. దాంతో చాలా విష‌యాలు ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నారు. దేవ‌దాస్ ద‌గ్గ‌ర ఆయ‌న నాలుగు సినిమాల‌కు ప‌నిచేశారు. 

సహాయ దర్శకుడిగా ఇ.వి.వి పనితీరు మెచ్చిన నవతా కృష్ణంరాజు వెండితెర హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో నిర్మిస్తున్న 'నాలుగు స్తంభాలాట' సినిమాకు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా చేర్పించారు. ప్ప‌ట్నుంచీ జంధ్యాల ద‌గ్గ‌ర 23 సినిమాల‌కు ప‌నిచేశారు స‌త్య‌నారాయ‌ణ‌. ఫ‌లితంగా జంధ్యాల శిష్యుడిగా ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు బాగా గుర్తింపు ల‌భించింది. కామెడీ పాయింట్‌ను శ్రుతిమించ‌కుండా ఎలా తీస్తే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకుంటుంద‌నే విష‌యం జంధ్యాల నుంచే ఆయ‌న ఆక‌ళింపు చేసుకున్నారు. 

జంధ్యాల ద‌గ్గ‌ర‌కు రాక‌ముందు స‌త్య‌నారాయ‌ణ దృష్టి కేవ‌లం ద‌ర్శ‌క‌త్వం మీదే ఉండేది. జంధ్యాల వ‌ద్ద‌కు వ‌చ్చాక క్ర‌మంగా ఆయ‌న దృష్టి ర‌చ‌న‌వైపు మ‌ళ్లింది. ఆ స్ఫూర్తితో అప్పుడ‌ప్పుడు క‌థ‌లు రాసి ప‌త్రిక‌ల‌కు పంపేవారు. అయితే వాటిలో అత్య‌ధికం ప్ర‌చుర‌ణ‌కు అన‌ర్హ‌మైన‌విగా వెన‌క్కి తిరిగి వ‌చ్చేవి. అలా తిరిగివ‌చ్చిన వాటిలో 'ఆడే మ‌గైతే' అనే క‌థ ఒక‌టి. ఈ క‌థ‌ను 'మొగుడు - పెళ్లాలు' సినిమా షూటింగ్ స‌మ‌యంలో జంధ్యాలకు చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న విని, "బాగుంది స‌త్యం.. త‌ర్వాత వాడ‌దాం" అన్నారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. త‌ను డైరెక్ట‌ర్ అయ్యాక ఆ క‌థ‌ను ఆధారం చేసుకొని సినిమా తీశారు స‌త్య‌నారాయ‌ణ‌. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఆ సినిమా న‌రేశ్‌, ఆమ‌ని జంట‌గా న‌టించిన‌.. 'జంబ‌ల‌కిడిపంబ' చిత్రం. 

జంధ్యాల వద్ద పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు కావాలన్న అభిలాషతో కథలు తయారు చేసుకొని పలువురు నిర్మాతలను కలిసి వినిపించినా అవకాశాలు దక్కలేదు. అయితే సత్యంలో ఏదో ఉందని గుర్తించినది నటనిర్మాత అశోక్ కుమార్. డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్, ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘చెవిలో పువ్వు’ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో అన్నీ అమరాయి. కానీ, సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. టైటిల్ దెబ్బ కొట్టింది అని పలువురు చెప్పారు. ‘చెవిలో పువ్వు’ దర్శకత్వం వహించే సమయంలో ఎంతోమంది నిర్మాతలు ఇ.వి.వి.కి అడ్వాన్సులు ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పోయేసరికి, ఇ.వి.వి.ని చూడగానే ముఖం చాటేసేవారు. 

ఆ సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది మూవీ మొఘల్ రామానాయుడు గారే! ఆయన కాంపౌండ్‌లో చేరి పనిచేస్తూ ఉండగా, కమల్ హాసన్‌తో నాయుడు గారు ‘ఇంద్రుడు-చంద్రుడు’ నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు ఇ.వి.వి. ఆ సమయంలో కమల్‌తో కలసి పనిచేయడంతో స్క్రిప్ట్ ఎలా చక్కదిద్దవచ్చునో తెలుసుకున్నారు. ఆ పై రామానాయుడు నిర్మించిన ‘ప్రేమఖైదీ’ని రూపొందించారు ఇ.వి.వి. ఈ సారి గురి తప్పలేదు. ‘ప్రేమఖైదీ’ మంచి విజయం సాధించింది. ఇక ఇ.వి.వి. వెనుతిరిగిచూసుకోలేదు. 

ఇ.వి.వి తన గురువు జంధ్యాల లాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా “అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజన్ దొంగలు” వంటి చిత్రాలు రూపొందించి, ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేశారు. ఇక నరేశ్‌తో ఇ.వి.వి. తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు.

తెలుగులో శ్రీకాంత్, హరీశ్, వినోద్ కుమార్ వంటి వర్ధమాన కథానాయకులకు ఇ.వి.వి చిత్రాలే పేరు సంపాదించి పెట్టాయి. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ‘ఆమె’ వంటి ఆలోచింప చేసే చిత్రాన్నీ రూపొందించారు. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్’, విక్టరీ వెంకటేశ్‌తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు’ , బాలకృష్ణతో ‘గొప్పింటి అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ ని తెరకెక్కించిందీ ఇ.వి.వి.నే! 

ఇ.వి.వి సినిమాల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ఆ ఒక్కటి అడక్కు, జంబాలకిది పంబ, అల్లుడా మజాకా, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, మా ఆవిడ మీద ఒట్టు... మీ ఆవిడ చాలా మంచిది, వీడెక్కడి మొగుడండీ?, థాంక్యూ సుబ్బారావు, కత్తి కాంతారావు, బురిడీ, అప్పుల అప్పారావు, బెండు అప్పారావు, ఫిట్టింగ్ మాస్టర్, చిలక్కొట్టుడు, పెళ్లయింది కానీ..., అత్తిలి సత్తిబాబు, కితకితలు, ఆడింతే ...ఆదో టైపు, మా అల్లుడు వెరీ గుడ్డు, ఆరుగురు పతివ్రతలు, ఎవడి గోల వాడిదే, తొట్టి గ్యాంగ్, ఆలీబాబా అరడజను దొంగలు, ఏవండీ...ఆవిడ వచ్చింది...ఇలా సినిమా పేరులోనే కూసింత చమత్కారాన్ని జోడించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఈవీవీ స్టయిల్. సినిమా ప్రారంభంలోనూ టైటిల్స్ వేసేటప్పుడు కూడా సరిగ్గా ఇదే చమత్కారాన్ని వాడేవారు. రాతగాడు, తీతగాడు, కోతగాడు...ఇలా నానారకాలుగా ప్రయోగాలు చేసేవారు. 

థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు ఆనంద క్షణాల్ని అందించే కళాకారుడు. కేవలం కమర్షియల్ చిత్రాల విజయలతోనే సరిపుచ్చుకోకుండా దర్శకుడిగా ఓ స్థానం అందుకున్నాక మంచి చిత్రాల దర్శకుడిగా కూడా తనని తాను నిరూపించుకోవడానికి తపన పడ్డారు. ఆ నేపథ్యంలోనే ఇ.వి.వి మహిళా ప్రేక్షకులు ఆదరించే కొన్ని చిత్రాలను తీశారు. ఆ కోవాలోనివే ఆమె, మావిడాకులు, కన్యాదానం, తాళి, నేటి గాంధీ తదితర చిత్రాలు.

దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఇ.వి.వి తన మార్క్ నిరూపించుకున్నారు. 2000 సంవత్సరం లో చాలా బాగుంది చిత్రంతో నిర్మాతగా కొత్త సినీ  ప్రయాణం మొదలెట్టారు. 2001లో మా ఆవిడ మీద ఒట్టు... మీ ఆవిడ చాలా మంచిది, 2002లో తొట్టి గ్యాంగ్, 2003లో నువ్వంటే నాకిష్టం, 2004లో ఆరుగురు పతివ్రతలు, 2005లో కితకితలు, 2007లో అత్తిలి సత్తిబాబు ఎల్కేజి, 2008లో ఫిట్టింగ్ మాస్టర్ చిత్రాలను ఇ.వి.వి నిర్మించారు. 

తెలుగు చిత్రాలకే కాకుండా ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చిత్రంతో ఆయన హిందీలో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అమితాబ్, సౌందర్య కలసి నటించిన సూర్య వంశం చిత్రానికి ఈవీవీ దర్శకత్వం వహించారు. విజయం సాధించారు. హిందీ అస్సలు రాణి నేను...హిందీ సినిమాకు దర్శకత్వం చేయడమా? అని తొలుత ఆశ్చర్య పడ్డానని, అమితాబ్ బచ్చన్ అందించిన ప్రోత్సాహం కారణంగా నెరవేర్చానని ఇ.వి.వి తరచూ చెప్పుకునేవారు. 

 అశేష ప్రేక్షకుల విశేష ఆదరణ అందుకున్న ఇ.వి.వి 1994లో ఆమె చిత్రానికిగాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆమె దర్శకుడుగా సుమారు 40 దాకా వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాతే... సమయాన్ని కదిపే చిత్రాలపట్ల ఆసక్తి పెరిగిందని ఓ సందర్భంలో ఈవీవీ చెప్పుకున్నారు. ఆమె లో వితంతు వివాహాన్ని జరిపినా, మూడుసార్లు తాళి తెంచినా, కన్యాదానంలో భార్యనే ప్రియుడికి ఇచ్చి భర్త పెళ్లి చేసినా... మా నాన్నకు పెళ్లి చిత్రంలో కొడుకు తండ్రి పెళ్లి చేసినా ప్రేక్షకులు ఆదరించారంటే ...ఆయా సమస్యల్ని డీల్ చేయడంలో దర్శకుడి కమిట్మెంట్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది.

ఇ.వి.వి సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో ఆర్యన్ రాజేశ్‌ను హీరోగానూ, అల్లరి నరేశ్‌ను డైరెక్టర్ గానూ చూడాలనుకున్నారు. నరేశ్ కూడా కొన్ని సబ్జెక్టులు రాసుకున్నాడంటూ చెప్పేవారు. అయితే ‘అల్లరి’ చిత్రంతో నరేశ్ హీరో అయ్యాడు. అంతకు ముందు ఇ.వి.వి. డైరెక్షన్ లోనే ‘హాయ్’ చిత్రం ద్వారా రాజేశ్ హీరో అయినా, అంతగా అలరించలేకపోయాడు. ‘అల్లరి’ తరువాత నరేశ్ అల్లరి చేస్తూనే సక్సెస్ రూటులో సాగిపోయాడు. తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి ‘నువ్వంటే నాకిష్టం’ తీశారు. అదీ అలరించలేకపోయింది. నరేశ్‌తో కొన్ని నవ్వుల నావలు నడిపారు ఇ.వి.వి. 

తన సినీ కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించి మరెన్నో సినిమాలు ఆయన నుంచి వస్తాయన్న ప్రేక్షకుల ఆశల్ని వమ్ము చేస్తూ... ఆదరాబాదరాగా మరెన్నటికీ తిరిగి రాలేని దూర తీరాలకు తరలి పోయారు. 2011,జనవరి 21న అటు తెలుగు సినిమాకి, ఇటు హాస్యాన్ని అభిమానించే ఎంతో మంది ప్రేక్షకులకు చేదు వార్త వినిపించిన రోజు. ఈవీవీ ఇక లేరు అన్న ఆ వార్త తో ఒక్కసారి సినీ వినోదం కుప్ప కూలిపోయింది. ఏది ఏమైనా ఇ.వి.వి సత్యనారాయణ పేరు వినగానే ఆయన పండించిన నవ్వుల పువ్వులు ముందుగా గుర్తుకు వస్తాయి. తలచుకొనే కొద్దీ కితకితలు పెడుతూనే ఉంటాయి. 

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com