ఇండియన్ పొలిటికల్ కింగ్‌పిన్-అమర్ సింగ్

- January 27, 2025 , by Maagulf
ఇండియన్ పొలిటికల్ కింగ్‌పిన్-అమర్ సింగ్

అమర్ సింగ్ ... భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నేత.దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, మూవీ సెలెబ్రెటీస్ మరియు బడా పారిశ్రామికవేత్తలతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకుడు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుడి భుజంగా ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు అమర్ సింగ్. నేడు పొలిటికల్ కింగ్‌పిన్ అమర్ సింగ్ జయంతి. ఈ సందర్భంగా అమర్ సింగ్ జీవన ప్రస్థానం మీద ప్రత్యేక కథనం. 

అమర్ సింగ్ 1956,జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘడ్ ప్రాంతంలో రాజ్‌పుట్ సామాజిక వర్గానికి చెందిన హరీష్ చంద్ర సింగ్, శైల్ కుమారీ దంపతులకు  జన్మించారు. తండ్రి వ్యాపారరీత్యా అమర్ సింగ్ చిన్నతనంలోనే వారి కుటుంబం కలకత్తాకు మకాం మార్చడం జరిగింది. కలకత్తాలోని St. Xaviers కాలేజీలో బీఏ డిగ్రీ, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పట్టా పొందారు. విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అమర్ సింగ్ హిందూస్తాన్  బిర్లా గ్రూప్ అధినేత కె.కె.బిర్లా పర్సనల్ లైయసన్ ఆఫీసర్‌గా పనిచేశారు. 

అమర్ సింగ్ విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగం "ఛత్ర పరిషద్"లో చేరి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వారి ద్వారా కాంగ్రెస్ ఎంపీ మరియు పారిశ్రామికవేత్త కె.కె బిర్లా, మాజీ కేంద్ర మంత్రి మరియు గ్వాలియర్ మహారాజు మాధవరావ్ సింధియాలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరిద్దరూ సింగ్ రాజకీయ ఎదుగుదలకు తమవంతుగా తోడ్పడ్డారు. వీరి వల్లే యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ కు దగ్గరయ్యారు. యూపీ సీఎం పరిచయం అమర్ సింగ్ రాజకీయ జీవితాన్నీ మరో మలుపు తిప్పింది. 

1980 మధ్యలో యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సోషలిస్టు దిగ్గజం ములాయం సింగ్ యాదవ్‌‌కు అమర్ సింగ్ దగ్గరయ్యారు. ములాయం జనతాదళ్ తరపున యూపీ సీఎం అయిన తర్వాత నుంచి ఆయన ప్రతినిధిగా ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతూ వచ్చారు సింగ్. 1992లో ములాయం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన సమయంలో జానేశ్వర్ మిశ్రా, బేణీప్రసాద్ వర్మ, శివపాల్ సింగ్ యాదవ్‌లతో పాటుగా అమర్ సింగ్ ఉన్నారు. సమాజ్‌వాదీ, బీఎస్పీల మధ్య  పొత్తు ఏర్పడటంలో తెరవెనుక కీలకంగా వ్యవహరించిన నేతల్లో అమర్ సింగ్ ఒకరు. 

1996లో కేంద్రంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం సింగ్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఢిల్లీలో ములాయంకు కావాల్సిన అన్ని వ్యవహారాలను అమర్ సింగ్ చూసుకునేవారు. అమర్ సింగ్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా బడా పారిశ్రామిక, ఢిల్లీ జర్నలిస్ట్ మరియు మేధో వర్గాలను ములాయంకు దగ్గర చేయడం మొదలుపెట్టారు. ములాయం ప్రతినిధిగా రక్షణ శాఖ కాంట్రాక్ట్స్ కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం రాజకీయ మేధావుల్లో ఉంది. 

1995-2003 వరకు సమాజ్‌వాదీ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్ని అమర్ సింగ్ చూసుకునేవారు. తనకున్న విస్తృత పరిచయాలను ఉపయోగించి పార్టీకి భారీగా  విరాళాలు సమకూర్చారు. 2003లో ములాయం నాలుగోసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ములాయం తరపున ఆహ్వానించారు. 2003-07 వరకు సాగిన ఎస్పీ పాలనలో అమర్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. 

2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను ములాయం సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. 2010-2015 వరకు రాజకీయ నిర్బంధాన్ని అనుభవించిన అమర్ సింగ్, 2016లో తిరిగి ములాయంకు చేరువయ్యారు. 2018లో తిరిగి సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. 

1996,2002,2008,2016లలో నాలుగుసార్లు రాజ్యసభ నుంచి ఎన్నికైన అమర్ సింగ్, పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రాజకీయాల్లోకి రావడానికి అమర్ సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. అఖిలేష్ ప్రేమ వివాహానికి మద్దతుగా నిలిచిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. అయితే, ములాయంను అడ్డుపెట్టుకొని తమ కుటుంబాన్ని చీల్చే ప్రక్రియ అమర్ చేస్తున్నారనే అనుమానంతో ఆయన్ని శత్రువుగా భావిస్తూ వచ్చారు అఖిలేష్. 

రాజకీయాలను పక్కన పెడితే, హిందీ సినిమా రంగంతో ఆయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ కుటుంబంతో అమర్ సింగ్‌కు ఉన్న  పరిచయాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అమితాబ్ దివాళా తీసిన సమయంలో ఆయనకు అండగా నిలిచినా వ్యక్తుల్లో అమర్ సింగ్ ఒకరు. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులైన బచ్చన్ లను సమాజ్‌వాదీ పార్టీలో చేర్పించిన ఘనత కూడా ఆయనదే కావడం విశేషం. బాలీవుడ్ సినీ ప్రముఖలతో అమర్ సింగ్ చాలా సన్నిహిత పరిచయాలను నెరిపారు. 

నాలుగు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ 2020,ఆగస్టు1న తన 64వ ఏట కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా సింగపూర్ దేశంలో కన్నుమూశారు. అమర్ సింగ్ లాంటి రాజకీయ సామాజిక పరిచయ చతురత కలిగిన నాయకుడు భారతదేశ రాజకీయాల్లో మరొకరు తయారు కాలేరు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com