వరల్డ్ క్యాన్సర్ డే

- February 04, 2025 , by Maagulf
వరల్డ్ క్యాన్సర్ డే

అత్యాధునిక వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనిషి జీవిత కాలాన్ని పెంచుకోగలుగుతున్నా, క్యాన్సర్‌కు సరైన పరిష్కారం ఇంకా అందుబాటులోకి రాలేదు.ఎన్నో మందులు, కొత్త చికిత్సలు అందుబాటులో ఉన్నా, క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగానే ఉంది.అందువల్లే క్యాన్సర్‌ పేరు వినగానే భయం పుట్టుకొస్తుంది. అయితే, మొదటి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు.గతంలో అనుకోకుండా వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లు ఇప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయి.సమయానికి సరైన చికిత్స పొందకపోవడం వల్ల అనేక మంది ఈ వ్యాధికి బలవుతున్నారు.అందుకే క్యాన్సర్‌ వ్యాధుల గురించి అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే  నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం క్యాన్సర్‌ చిన్నాపెద్దా తేడా అందరిలోనూ వస్తుంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. 9 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.దీనిని తొలిదశలో గుర్తించటం, త్వరగా చికిత్స చేయటం ద్వారా మూడింట ఒక వంతు మరణాలను ఆపొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల క్యాన్సర్‌ మీద అవగాహన కలిగుండటం, లక్షణాలు గురించి తెలుసుకొని ఉండాలని సూచిస్తున్నారు.

ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, దాని నివారణ, చికిత్స, నియంత్రణకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి. క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి.. దీని కారణంగా ప్రతి ఏడాదిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువతలో కూడా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలా నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫిబ్రవరి 2024 నాటికి భారత్‌లో 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ సంఖ్య 2025 నాటికి 15 లక్షలకు పైగా చేరుకుంటుందని ఒక అంచనా ఉంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..ఈ క్యాన్సర్  కేసుల్లో దాదాపు సగం యువతలోనే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మన ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగించడమే కాకుండా సమాజం, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

అనారోగ్యకరమైన జీవనశైలి:

నేటి బిజీ లైఫ్‌లో యువత తమ ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో ఉండే హానికరమైన అంశాలు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి.క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

పొగాకు-మద్యం:

సిగరెట్లు, గుట్కా, మద్యం సేవించడం వల్ల యువతలో క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. ఈ అలవాట్లు ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయ క్యాన్సర్లకు ప్రధాన కారణాలుగా మారాయి.

ఊబకాయం-శారీరక శ్రమ లేకపోవడం:

చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఊబకాయం రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కాలుష్యం-రసాయనాల ప్రభావం:

పెరుగుతున్న వాయు కాలుష్యం, నీటిలో హానికరమైన రసాయనాలు, యూవీ కిరణాల ప్రభావం కూడా క్యాన్సర్ కేసులను పెంచుతున్నాయి.

ఒత్తిడి-నిద్ర లేకపోవడం:

ఆధునిక జీవనశైలిలో, ఒత్తిడి, నిద్ర లేకపోవడం యువత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ముఖ్యంగా క్యాన్సర్‌ రాకుండా నివారించేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం మానుకోవాలి.రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి.అలాగే,  కాలుష్యానికి దూరంగా ఉండాలి. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా సకాలంలో వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స పొందడం అత్యంత కీలకం. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com