అయోధ్య రామయ్య భక్తులకు అలర్ట్..

- February 08, 2025 , by Maagulf
అయోధ్య రామయ్య భక్తులకు అలర్ట్..

అయోధ్య: అయోధ్య రామాలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్. బాల రాముడి ఆలయ దర్శనం వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక పై ఉదయం 6 గంటల నుంచే భక్తులకు బాల రాముడి దర్శనం కల్పిస్తారు.ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా..దీన్ని గంట ముందుకు జరిపారు.రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. రామ మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

తెల్లవారుజామున 4 గంటలకు మంగళ హారతి ఇచ్చాక ద్వారాలు మూసివేస్తారు. భక్తుల సందర్శన కోసం ఆలయాన్ని తెరిచేందుకు గుర్తుగా ఉదయం 6 గంటలకు శ్రింగార్‌ హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగ్ నైవేద్య సమర్పణ సమయంలోనూ దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు.

సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతి సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేస్తారు. ఆ తర్వాత దర్శనం కల్పిస్తారు. ఇప్పటివరకు రాత్రి 9గంటల 30 నిమిషాల శయన హారతిని ఇస్తున్నారు. ఇకపై శయన హారతిని రాత్రి 10 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.

కోటి మందికి పైగా భక్తుల సందర్శన..
అయోధ్య రామాలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు కోటి మందికి పైగా భక్తులు అయోధ్య నగరాన్ని సందర్శించారని, ఇది సరికొత్త రికార్డ్ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక, ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ పుణ్య స్నానం ఆచరించి అటు నుంచి అయోధ్య రాముడి దర్శనానికి తరలి వెళ్తున్నారు. దీంతో అయోధ్యలో భక్తుల రద్దీ నెలకొందని ఆలయ వర్గాలు తెలిపాయి.

పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా దర్శన సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 90 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు దర్శన సమయాన్ని పొడిగించారు. ప్రసాదం సమర్పణ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ట్రస్ట్ తెలిపింది. రామాలయం అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయాన్ని రోజుకు 18 గంటల పాటు తెరిచే ఉంచేందుకు ఆలయ ట్రస్ట్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com