తెలుగు పాత్రికేయ దిగ్గజం-పొత్తూరి
- February 08, 2025
పొత్తూరి వెంకటేశ్వరరావు... తెలుగు పత్రికారంగంలో ఐదు దశాబద్దాలకు పైగా సేవలు అందించారు. అన్ని వాదాలను, అభిప్రాయాలను అందిస్తూ ప్రజల మధ్య సామరస్య బంధాలను పెంచిపోషించడమే జర్నలిజం మౌలిక కర్తవ్యం.ఈ స్ఫూర్తిని, లక్ష్యాన్ని పొత్తూరి తన వ్యక్తిగత లక్షణంగా మలుచుకున్నారు.ఈనాడు, ఆంధ్రభూమి, వార్త పత్రికల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. సుదీర్ఘ పాత్రికేయత్వంలో విలువల విషయంలో రాజీపడకుండా, బాధ్యతగల పౌరుడిగానూ తన పాత్రను బహుముఖీనంగా దిగ్విజయంగా పోషించారు. నేడు ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు జయంతి.
పొత్తూరి వెంకటేశ్వరరావు 1934,ఫిబ్రవరి 8వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త గుంటూరు జిల్లాలోని పొత్తూరు గ్రామంలో వైదిక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వెంకట సుబ్బయ్య, పన్నగేంద్రమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చేశారు.ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు, దగ్గరి బంధువు వి.బి.రాజు ప్రోద్బలంతో 1957లో హైదరాబాద్‌లో ఆంధ్ర జనతలో అక్షరాలు దిద్దుకుని తన సుదీర్ఘ పాత్రికేయ ప్రస్ధానానికి శ్రీకారం చుట్టారు.
ఆ తదుపరి ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికల్లో అయిదు దశాబ్దాలకు పైగా కొనసాగారు. ఆంధ్రప్రభ డెయిలీ, వీక్లీ రెంటికీ సంపాదకత్వం వహించారు. ఆంధ్రప్రభతో పధ్నాలుగేళ్ల అనుబంధం ఆయనది. కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) రూపంలోకి మళ్ళించి అంతర్జాలం (ఇంటర్ నెట్) మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ పథకం అవిష్కరించారు వెంకటేశ్వరరావు. ఎడిటర్లే సారథులై, ప్రజాపక్ష వారధులై, రాజీలేని రుషులై, పత్రికా కేతనాన్ని సమున్నతంగా భుజాల మీద మోసిన మహనీయుల స్వర్ణయుగపు చిట్టచివరి లింకు పొత్తూరి వారే!
ఆంధ్రభూమిలో ఎడిటర్‌గా ఉన్నప్పుడు పొత్తూరి పెట్టిన ఒక శీర్షికలో తప్పుదొర్లింది. దీంతో నైతిక బాధ్యతను తీసుకొని పొత్తూరి రాజీనామా సమర్పించారు. అయితే యాజమాన్యం దానికి అంగీకరించలేదు. ఉదయం పత్రికకు ఎడిటర్‌గా పనిచేసినప్పుడూ పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రత్యేక వార్తా కథనాలను మధ్యలోనే నిలిపివేయాలని ఉదయం యజమాని సుబ్బరామరెడ్డి ఆదేశించారు. తాను ఎడిటర్‌గా ఉండగా ఆ ప్రచురణను నిలిపే ప్రసక్తి లేదని చెప్పి, రాజీ పడకుండా రాజీనామా చేసి బయటకు వచ్చారు. వృత్తి ధర్మాలను ఆయన నిష్ఠగా పాటించేవారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ స్థాపనలో పొత్తూరి వారి పాత్ర చాలా కీలకం. నేదురుమల్లి జనార్దన రెడ్డి ఇచ్చిన హామీని తర్వాత పాలకులకు సైతం గుర్తు చేయడంలో వరదాచారి, శ్రీనివాసరెడ్డి, ఇనగంటి వెంకట్రావు మరియు పొత్తూరి గార్లు కీలక పాత్ర వహించారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఏర్పడిన తర్వాత 1996 ఫిబ్రవరి 22 నుండి 1998 ఫిబ్రవరి 21వరకు కె.శ్రీనివాసరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1999 ఫిబ్రవరి 12 నుండి 2002 మే 2 వరకు పొత్తూరి వారు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. వీరి హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు శిక్షణ తరగతుల నిర్వహణ మరియు అకాడెమీ తరపున తెలుగు పాత్రికేయానికి మకుటాయమానంగా నిలిచిన పాత పత్రికల డిజిటలీకరణ జరిగింది.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లో పొత్తూరి క్రియాశీల పాత్ర పోషించారు. నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు పొత్తూరి, మరికొందరు నల్లమల అడవుల్లోకి వెళ్లారు. రామకృష్ణ సహా పలువురు మావోయిస్టు నాయకులతో వీరు మాట్లాడారు. పలువురు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా చేశారు.
తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి వారి నిష్ఠ అపారమైనది. తన వృత్తిగత జీవితంలో తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి పొత్తూరి వెంకటేశ్వరరావు తోడ్పడుతూ వచ్చారు. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తెలుగు భాషాభ్యున్నతికి కారకులయ్యారు. దాదాపు నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికారంగ చరిత్రలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు మైలు రాయిగా నిలిచిపోతారు.
పొత్తూరి గొప్ప చదువరి. చదవడంతో పాటు రచయిత సమ కాలీన స్థితి గతులు, భాషా పదజాల ప్రయోగం, రచయిత రచనా నడక, దాని ఉనికి, అందులోని నిక్షిప్త సారం ఇలాటి విషయాలన్ని తెలుసుకుంటారు. ఇవి రచనా కౌశలం పెంపొందిస్తాయి. ఇవి కాక రచయిత ధోరణి, వారి భావాలు, విషయం తెలిపే విధానం, వారికున్న చింతన ఇలాటి విషయాల్ని కూడా ఆకళించుకుంటారు. దీనికి "సద్ చింతన" ఉండాలి. అది తప్పని సరి. ఇది పొత్తూరి వారిలో మెండుగా ఉంది. పొత్తూరి రచనలు, సామాన్య భాషలో, సూటిగా ఉంటాయి. వీరి వ్యాసాలు, రచనలు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి.
పొత్తూరి వెంకటేశ్వరరావు రచనలలో కొన్ని ముఖ్యమైనవి తెలుగు పత్రికలు, నాటి పత్రికల మేటి విలువలు, చింతన, చిరస్మరణీయులు, కాశీనాధుని నాగేశ్వరరావు పారమార్ధిక పదకోశం వంటి రచనలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని డాక్టరేట్ పట్టాతో గౌరవించింది. టీటీడీ సంపాదక మండలిలోనూ సభ్యుడిగా ఉన్నారు. పారమార్థిక పదకోశం ఓ తెలుగు నిఘంటువు. దీన్ని తయారుచేసేందుకు సంస్కృత పండితుడు పుల్లెల రామచంద్రం దగ్గర ఆయన సంస్కృతం నేర్చుకున్నారు.''విధి నా సారథి'' పేరుతో తన ఆత్మకథ రాశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్నారు.
ఆధునిక పాత్రికేయ వ్యవస్థపై ఆయన మాట్లాడుతూ ‘‘అప్పట్లో పత్రికలు విలువలు పాటించేవి. సంపాదకులు నడిపించేవారు. నేడు, పరిస్థితి మారింది. పత్రికలను యజమానులే నడిపిస్తున్నారు. పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రేటింగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు, విలువలు పడిపోయాయి.’’ అని ఓ సందర్భంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నేడు చిన్న (స్థానిక) పత్రికలు చాలా మటుకు అంతరిస్తున్నాయి. వ్యయ ప్రయాసలు చాలా పెరిగి పోయాయి. వీటితో పాటు విలువలు, ప్రమాణాలు పరిరక్షిచుకోవడం మరింత కష్టమవుతోంది’’ అని పొత్తూరి అనేవారు.
మనుషులలో ఉన్న మంచితనం చూడడం వారి విశేష గుణం. తిరగేసిన ఏ గ్రంథాన్నైనా క్షుణ్నంగా ఆకళించుకుని దానిలో, వ్రాసిన వారిలో ఉన్న మంచిని, రచయిత దోరణిని సైతం విశదీకరించగలరు. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్ తెలుగు పత్రికా చరిత్ర ఎరిగిన సంపాదకులుగా పొత్తూరి నిలిచిపోతారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







