దిగ్గజ రాజకీయవేత్త -రాజేశ్ పైలట్
- February 10, 2025
రాజేశ్ పైలట్...80,90 దశకాల్లో భారత దేశ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించిన నాయకుడు.వైమానిక దళం అధికారిగా దేశ రక్షణలో పాటుపడ్డ ఆయన ఇందిరా గాంధీ పిలుపునందుకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రైతు నాయకుడిగా రైతాంగం ప్రయోజనాల కోసం చివరి శ్వాస వరకు పాటుపడ్డారు.కేంద్ర మంత్రిగా సైతం రాణించారు.నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేశ్ పైలట్ జన్మదినం సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం మీకోసం ....
రాజేశ్ పైలట్ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. 1945,ఫిబ్రవరి10వ తేదీన ఒకప్పటి యునైటెడ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని బైద్‌పుర అనే కుగ్రామంలో జై దయాళ్ సింగ్, బల్‌దాయి దంపతులకు జన్మించారు. 10 ఏళ్ళ వయస్సులోనే తండ్రి మరణంతో వారి కుటుంబం పేదరికంలోకి నెట్టబడింది. అయినప్పటికీ పట్టుదలతో తన చదువును సాగించారు. 10వ తరగతి వరకు ఢిల్లీలో చదువుకున్న ఆయన అనంతరం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్)లో చేరారు. అక్కడే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
పైలట్ తండ్రి జై దయాళ్ సింగ్ ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా రిటైర్ అయ్యారు. తన కుమారుడిని సైతం ఇండియన్ ఆర్మీలో పెద్ద అధికారిగా చూడాలని కలలు కనేవారు. అయితే, తండ్రి ఆకస్మిక మరణంతో వారి కుటుంబం ఇబ్బందులు పడినప్పటికి తండ్రి కోరికను నెరవేర్చే క్రమంలో చిన్నారి రాజేశ్వర్ చాలా కష్టపడ్డాడు. మొదట ఆర్మీలో ఎంపికైనప్పటికి పైలట్ ఉద్యోగం పట్ల మక్కువతో ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. 1966-79 వరకు ఎయిర్ ఫోర్స్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ స్క్వాడ్రన్ లీడర్ అయ్యారు. 1971 ఇండియా - పాకిస్తాన్ యుద్ధంలో సైతం పాల్గొన్నారు.
ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న సమయంలోనే అప్పటి కాంగ్రెస్ యువనేత సంజయ్ గాంధీతో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి. పైలట్ వ్యక్తిత్వం, అంకిత భావం చూసి రాజకీయాల్లోకి రావాల్సిందిగా తన తల్లి ఇందిరా గాంధీ ద్వారా ఆహ్వానం పలికించారు.సాక్షాత్తు ఇందిరనే రాజకీయాల్లోకి రమ్మనడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే రాజేశ్వర్ ప్రసాద్ కాస్త రాజేశ్ పైలట్‌గా రూపాంతరం చెందారు. 1980లో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ నుంచి మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత దౌసా నియోజకవర్గానికి మారి 1985,1991,1996 మరియు 1999లలో ఎన్నికయ్యారు.
సంజయ్ గాంధీ సన్నిహితుడిగా తొలుత మెలిగిన పైలట్, 1980లో సంజయ్ ఆకస్మిక మరణంతో ఇందిరా గాంధీ సూచనల మేరకు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. రాజీవ్ సైతం కమర్షియల్ ఏరో పైలట్ కావడంతో వారిద్దరూ అతికొద్ది కాలంలోనే అత్యంత సన్నిహితులయ్యారు. 1984లో ఇందిరా గాంధీ ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 1984-85 వరకు రాజీవ్ సూచనల మేరకు పార్టీ మరియు ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరించారు. సింధియా రాజ కుటుంబానికి చెందిన మాధవ్ రావ్ సింధియాతో పైలట్ సన్నిహితంగా మెలిగేవారు. 1985-89 మధ్యలో రాజీవ్ మంత్రివర్గంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
1989-91 వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలు ప్రజా పోరాటాల్లో పైలట్ చురుగ్గా పాల్గొన్నారు. 1991లో రాజీవ్ ఆకస్మిక మరణం తర్వాత దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాల కారణంగా కాంగ్రెస్ అతిస్వల్ప మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న సమయంలో పార్టీలో ప్రధాని పదవి కోసం పివి నరసింహారావు, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీల మధ్య జరిగిన ముక్కోణపు పోరులో సోనియా గాంధీ సూచనల మేరకు పివి వైపు పార్టీ మొగ్గు చూపేలా చేయడంలో పైలట్ పాత్ర కీలకం.
1991-96 వరకు పివి మంత్రివర్గంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ (స్వతంత్ర) మంత్రిగా, కేంద్ర హోమ్ శాఖలో అంతర్గత భద్రత మరియు పర్యవరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి పివి రాజీనామా చేసిన తర్వాత సీతారామ్ కేసరి పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే, కేసరి పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి 1997లో జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కేసరి అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పైలట్ పోటీ పడినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 1998లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో మాధవ్ రావ్ సింధియా, పైలట్ కీలకంగా వ్యవహరించారు.
పైలట్ రాజకీయాల్లో వచ్చిన నాటి నుంచి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేస్తూనే వచ్చారు. తానూ నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన దౌసా నియోజకవర్గం అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. రాజస్తాన్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన దౌసాలో అభివృద్ధి కార్యక్రమాలు పైలట్ హయం నుంచే జరగడం మొదలైంది. 1987లోనే రైతాంగ సంక్షేమం కోసం జై జవాన్, జై కిసాన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పైలట్ వ్యక్తిగత జీవితానికి 1974లో రమా పైలట్ ను వివాహం చేసుకున్నారు. రమా సైతం భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్యెల్యేగా రెండు సార్లు, ఒక పర్యాయం లోక్ సభ ఎంపీగా పనిచేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు సారిక, కుమారుడు సచిన్. సచిన్ పైలట్ సైతం తల్లిదండ్రుల అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రిగా, రాజస్థాన్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిష్టర్‌గా పనిచేశారు. 1971 యుద్ధంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి పూర్వి స్టార్ మెడల్ అందుకున్నారు.
రెండు దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించిన రాజేశ్ పైలట్ గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. సంజయ్ నుంచి సోనియా గాంధీ వరకు కుటుంబ శ్రేయోభిలాషిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో మరో మెట్టు ఎక్కబోతున్నారు అనే సమయంలో దురదృష్టవశాత్తు 2000, జూన్11న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తన 55వ ఏట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







