జైలులో వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..

- February 18, 2025 , by Maagulf
జైలులో వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..

గన్నవరం: కిడ్నాప్ కేసులో అరెస్టయిన వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జైలుకు వెళ్లి వంశీతో ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ వెంట కొడాలి నాని, పేర్ని నానితోపాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. జైలులో వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వంశీని అరెస్ట్ చేసిన తీరు దారుణం అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కేసును ఉపసంహరించుకున్నాడు. వంశీ తప్పు చేయలేదని సత్యవర్ధన్ చెప్పినప్పటికీ తప్పుడు కేసు పెట్టారని అన్నారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. మొదట్లో వంశీ పేరు ఎక్కడా లేదు. దాడి ఘటనలో వంశీ లేరు. వంశీని 71వ నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయానని సత్యవర్ధన్ చెప్పాడు. సత్యవర్ధన్ ను తీసుకెళ్లి తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని జగన్ ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకిరాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేసి.. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్ మెంట్ తీసుకున్నారు. అందులోనూ వంశీ తప్పులేదని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడిందిలేదు.. ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు.. కానీ, వంశీపై కక్షగట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెట్టించారని జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీకి బెయిల్ రాకూడదని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. అధికారులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగం కావొద్దు. మీ టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి.అన్యాయం చేసే అధికారులు, నేతలను చట్టం ముందు నిలబెడతాం.న్యాయం జరిగేలా చేస్తాం అని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com