ఏపీలో త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు

- February 21, 2025 , by Maagulf
ఏపీలో త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది.ఆరోగ్య శ్రీతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు.ఆ పథకం అమలుకు ప్రభుత్వం ప్రక్రియ చేపట్టబోతోంది. దీనికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది.అందులో తక్కువకు కోట్ చేసిన వాళ్లకు ఈ టెండర్లు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు బీమా పథకం అమలులోకి వస్తే దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు లభించనున్నాయి.

రాష్ట్రంలో ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు విషయమై చర్చించేందుకు వారం పది రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో నిర్ణయం తీససుకోనున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా చేసి టెండర్లు పిలవబోతున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదించిన అంశాల్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అనంతరం టెండర్లు పిలవడం జరిగిపోతుంది. దీంతో పథకం అమలు ఏప్రిల్‌ లేదా మే నుంచి స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి పాతిక లక్షల విలువై సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా లభిస్తున్నాయి. ఇప్పుడు తీసుకురాబోతున్న ఆరోగ్య బీమా పథకం ద్వారా పరిమితులు, షరతులు లేకుండా అందరికీ సేవలు అందుతాయి.

ఉచిత ఆరోగ్య బీమా పథకం వస్తే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూనే ఉచిత బీమా పథకం కూడా అమలులోకి వస్తుందని చెబుతున్నారు. రెండున్నర లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ద్వారా సేవలు అందిస్తారు. ఆపై ఖర్చు అయితే ఆరోగ్య శ్రీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రెండున్నర లక్షల లోపు వైద్య ఖర్చులు పెట్టే వారి సంఖ్య 90శాతానికిపైగా ఉంటోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com