విప్లవ నాయకి-జయలలిత
- February 24, 2025
జయలలిత ... తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన నాయకురాలు. అంతకంటే ముందు వెండితెర మీద కోట్లాది మంది అభిమానుల నీరాజనాలు అందుకున్న స్టార్ హీరోయిన్.దక్షిణాదిన 70వ దశకంలో వరుస హిట్లతో అగ్రపథాన దూసుకెళ్లిన నటీమణిగా ఆమె భారత చిత్ర పరిశ్రమకు సుపరిచితం.తన మార్గదర్శి ఎంజీఆర్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే తమిళనాడు రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేశారు. జాతీయ రాజకీయాల్లో సైతం ఆమె పాత్ర ప్రముఖం. నేడు విప్లవ నాయకి జయలలిత జయంతి సందర్భంగా ఆమె జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథనం...
జయలలిత జయరామ్ 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటే పట్టణంలో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందిన జయరామ్, వేదవల్లి ( నటి సంధ్య) దంపతులకు జన్మించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. తమిళ బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
జయలలిత తాతగారైన నరసింహన్ రంగాచార్యులు.. మైసూరు మహారాజా సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా పనిచేశారు. తండ్రి జయరామ్ లాయరుగా పని చేసేవారు. అయితే మద్యం వ్యసనానికి బలై జయలలిత జన్మించిన రెండేళ్లకే తండ్రి చనిపోయారు. దీంతో ఆమె కుటుంబం బెంగుళూరులోని అమ్మమ్మ గారింటికి చేరింది.
తల్లి వేదవల్లి బెంగుళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. అనంతరం మద్రాస్‌లో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ.. సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే జయలలిత, కుమారుడిని చదివించారు.
జయలలిత చాలా చురుకైన విద్యార్థి. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు. ప్రాథమిక విద్యను బెంగుళూరు బిషప్ కాటల్ బాలికల పాఠశాలలో పూర్తి చేసింది. మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్లోను కొనసాగించిన జయలలిత మెట్రిక్యులేషన్లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు. చదువుకుంటూనే సంప్రదాయ భరతనాట్యంతోపాటు మోహినీయాట్టం, మణిపురి, కథక్ వంటి నృత్యరీతులను జయలలిత నేర్చుకున్నారు. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించారు.
జయలలిత సినీ ప్రయాణం బాలనటిగా కన్నడ చిత్రం శ్రీశైల మహత్యే చిత్రంతో మొదలైంది. అలా ఆమె కన్నడ చిత్రాల్లో బాలనటిగా నటిస్తూనే ఒకవైపు చదువుకుంటూ ఉండేది. తల్లి సంధ్య సినీ జీవితం ముగిసే సమయానికి జయ మెట్రిక్యులేషన్ పూర్తి చేసి పీయూసీలో చేరింది. అయితే, ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్గా నటింపజేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టడంతో పాటుగా సంధ్య మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆమె సైతం తన కుమార్తెను స్టార్ హీరోయిన్గా అయ్యే అవకాశాలను పసిగట్టి జయను చదువు మాన్పించి పూర్తి స్థాయిలో నటిగా 1965 వెన్నిరాడై చిత్రంతో మారారు. ఆ చిత్రం ఘన విజయంతో ఇండస్ట్రీలో జయలలిత హీరోయిన్గా స్థిరపడ్డారు.
1965 - 77 మధ్యలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 140 పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రకథానాయకుల సరసన నటించారు. ముఖ్యంగా ఒక్క ఎంజీఆర్‌తోనే 38 చిత్రాల్లో నటించి తమిళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడిగా ప్రేక్షకుల నుంచి పేరుతెచ్చుకున్నారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మించిన బంధం ఏర్పడింది. 1972లో తల్లి మరణం తర్వాత సినిమాల పట్ల ఆసక్తి సన్నగిల్లి మునుపటిలాగా సినిమాల్లో యాక్టివ్ రోల్స్ చేయడం జయ మానేశారు.
జయ సినిమాలకు దూరమవుతున్న సమయంలోనే ఎంజీఆర్ సైతం సినీ రంగం నుండి రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వడంతో పాటుగా ఆయన స్థాపించిన అన్నా డీఎంకే పార్టీని తమిళనాడు ప్రజలకు దగ్గర చేసే క్రమంలో జయలలిత సహాయం ఆయనకు ఎంతో అవసర పడింది. వెండితెర మీద తమది హిట్ పెయిర్ కావడం మూలాన ఆమెను తన పార్టీ తరపున ప్రచారం చేస్తే సక్సెస్ అవుతామని నమ్మిన ఎంజీఆర్ 1977-80 వరకు అన్నా డీఎంకే ప్రచారాల్లో ఆమెను ఉపయోగించుకున్నారు.
80వ దశకం నాటికి జయ సైతం రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. 1980లో ఎంజీఆర్ రెండో పర్యాయం సీఎం అయిన నాటి నుండి పార్టీ కార్యక్రమాల్లో జయలలితను యాక్టివ్ చేయడం మొదలుపెట్టారు. 1981లో అధికారికంగా జయ అన్నా డీఎంకే పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆమెను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు ఎంజీఆర్. అయితే, జయ రాజకీయ ప్రయాణం పట్ల పార్టీలోని సీనియర్లు విముఖత వ్యక్తం చేసినప్పటికి ఎంజీఆర్ ఆశీస్సులు జయ మీద ఉండటంతో ఎవరు మాట్లాడేవారు కాదు.
1984లో ఢిల్లీలో తన ప్రతినిధిగా జయలలితను ఉంచాలనే ఆలోచనతో ఆమెను రాజ్యసభ ఎంపీగా ఎంజీఆర్ నామినేట్ చేశారు. జయ పార్లమెంటులో తన మొదటి ప్రసంగంతోనే ప్రధాని ఇందిరా గాంధీని ఆకట్టుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్, గాంధీల కుటుంబానికి సన్నిహితుడైన కుశ్వంత్ సింగ్ మాటల ప్రకారం " తన మొదటి ప్రసంగంతోనే ఆకట్టుకున్న జయ సినీ నేపథ్యం, ఆమె విద్యార్హతలు గురించి విని ప్రధాని ఇందిరా ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెను రాజకీయంగా ప్రోత్సహించడానికి సిద్ధం అయ్యారు" అని అన్నారు.
జయ ఢిల్లీలో ఉన్నంత కాలం జాతీయ రాజకీయాలను అవపోసన పట్టారు. ఇందిరా హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇదే సమయంలో మూడో పర్యాయం సిఎంగా ఎన్నికైన తర్వాత ఎంజీఆర్ తీవ్రంగా అనారోగ్యం పాలవడంతో పార్టీలో ఆయన వారసత్వం కోసం కీచులాటలు మొదలై తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో ఎంజీఆర్ కాలేయ వ్యాధితో మరణించారు. ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా ఆయన సతీమణి జానకిని తెరపైకి తేవడమే కాకుండా ఆమెను నెల రోజుల పాటు సీఎంగా కూర్చోబెట్టారు. ఇదే సమయంలో జయ పార్టీ శ్రేణుల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. జానకి అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేయడం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలన విధించడం చకచకా జరిగిపోయాయి.
1988 మధ్య నాటికి జానకి వర్గం మినహా అన్నా డీఎంకేలోని మెజారిటీ వర్గాలు అన్ని ఏకమై జయను ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా గుర్తిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో జయ నాయకత్వంలో అన్నా డీఎంకే ఎన్నికలకు వెళ్లగా 27 సీట్లను సాధించి తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారత దేశ రాజకీయ చరిత్రలో తోలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయలలిత రికార్డ్ సృష్టించారు. అదే ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో జయను అధికార డీఎంకే నేతలు ఘోరంగా అవమానించడమే కాకుండా ఆమె చీరను లాగి అసెంబ్లీ మర్యాదను మంటగలిపారు. తనకు జరిగిన అవమానానికి రగిలిపోయిన జయ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి మరి అసెంబ్లీని బాయికాట్ చేశారు.
1989లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలో ఉన్న 39 స్థానాలకు గాను 38 స్థానాలను గెలుచుకొని తన నాయకత్వం పట్ల పార్టీ శ్రేణులకు ఉన్న అపోహలను, అపనమ్మకాలను పటాపంచలు చేశారు. 1991లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే వారి మద్దతుతో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయించి ఎన్నికలు జరిపించగా 235 స్థానాలకు గాను 225 స్థానాలను కైవసం చేసుకొని జయలలిత మొదటిసారి సీఎం అయ్యారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో మొదటి మహిళా సీఎంగా జయలలిత తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు.
1996 నుంచి 2001 వరకు రెండో పర్యాయం ప్రతిపక్షంలో ఉన్నారు. ఇదే సమయంలో ఆమె జాతీయ రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. 1998లో కేంద్రంలో వాజపేయ్ ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా జాతీయ రాజకీయాల్లో జయ చక్రం తిప్పారు. అయితే, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయలేదనే నెపంతో ప్రభుత్వానికి సంవత్సరం లోపే తన మద్దతును ఉపసంహరించి 1999లో 13వ లోక్ సభ ఎన్నికలు రావడానికి పరోక్ష కారణమయ్యారు.
2001 ఎన్నికల్లో జయలలిత తిరిగి రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడులోని అరాచక శక్తులను అదుపు చేసేందుకు పోలీసులకు పూర్తి సహకారాన్ని అందజేశారు. ఈ సమయంలో తమిళనాడువ్యాప్తంగా భారీగా ఎన్కౌంటర్లు జరిగి ఎందరో రౌడీలు, మాఫియా డాన్స్ తుడుచుపెట్టుకుపోయారు. స్మగ్లర్ వీరప్పన్ ఎన్కౌంటర్ సైతం జయ సీఎంగా ఉన్నప్పుడే జరిగింది. ఇదే టర్మ్ లోనే అక్రమాస్తుల కేసులో భాగంగా ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లారు.
2002లో మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టటమే కాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో సైతం రెండోసారి భాగస్వామి అయ్యారు. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమె పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూసింది. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అన్నా డీఎంకే ఓటమి పాలైంది. 2006-11 వరకు మూడో పర్యాయం ప్రతిపక్షంలో కూర్చున్నారు.
2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగో పర్యాయం జయ సీఎం అయ్యారు. 2011-16 వరకు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, అమ్మ క్యాంటీన్ల పేరిట కేవలం రూ.5 లకే నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా జయలలిత పట్ల తమిళ ప్రజల్లో అభిమానం రెట్టింపు అయ్యి అవి ఓట్లుగా సైతం మారాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాలకు గాను 37 స్థానాల్లో అన్నా డీఎంకేకు పట్టంకట్టారు.
2014లో మరోసారి అక్రమాస్తుల కేసుల్లో జయ దోషిగా తేలడంతో సీఎం పదవికి రాజీనామా చేసి జైలు వెళ్లారు. 2015లో మధ్యంతర బెయిల్ దొరకడంతో తిరిగి ఐదో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జరిగిన ఎన్నికల్లో సైతం జయభేరి మోగించి ఆరో పర్యాయం సీఎం అయ్యారు. ఈ పర్యాయంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద దృష్టి సారించి ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే రైతులకు రుణమాఫీ, ఉచిత కరంట్ అమలు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా 74 రోజులపాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2016, డిసెంబర్ 5న తన 68వ ఏట కన్నుముశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







