రాజకీయ అజాతశత్రువు-దుద్దిళ్ల శ్రీపాదరావు

- March 02, 2025 , by Maagulf
రాజకీయ అజాతశత్రువు-దుద్దిళ్ల శ్రీపాదరావు

దుద్దిళ్ల శ్రీపాదరావు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివాదరహితులైన నేతల్లో ఒకరు. గాంధీ, నెహ్రూ, పివి నరసింహారావు స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన శ్రీపాదరావు సుదీర్ఘ కాలం స్థానిక సంస్థలకు ప్రాతినిథ్యం వహించారు.రాజకీయాల్లో నైతిక విలువలే ప్రామాణికంగా నడిచిన వీరు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు.నేడు ప్రజా నాయకుడు, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

దుద్దిళ్ల శ్రీపాదరావు 1937,మార్చి 2న ఒకప్పటి నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యంలో భాగమైన ఉత్తర తెలంగాణలోని మంథని తాలూకా ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. ఆయన పుట్టింది మాత్రం నాగపూర్ పట్టణంలోని అమ్మమ్మగారింట.ప్రాథమిక విద్యాభ్యాసం ధన్వాడలో పూర్తి చేసి, ఎస్.ఎల్.సిని మంథనిలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నగరానికి చేరుకొని ఇంటర్, డిగ్రీలను పూర్తి చేశారు.

1958-60 మధ్యలో మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ పంచాయతీ సమితి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తరువాత  న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేసి ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే తండ్రి హఠాన్మరణంతో స్వగ్రామానికి చేరుకొని కొద్దీ రోజుల పాటు వ్యవసాయం చేస్తూ గడిపారు.

శ్రీపాదరావు విద్యార్ధి దశలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా అప్పటి ప్రధాని నెహ్రూ యొక్క అభివృద్ధి దృకపథం వీరిని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే, మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన భావి భారత ప్రధాని పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం ఆయన్ని క్రియాశీలక రాజకీయాల్లోకి నడిపించింది. అదే సమయంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ధన్వాడా గ్రామ పంచాయతీ సర్పంచిగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.

పివి ప్రోత్సాహంతో రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన శ్రీపాదరావు 1965-1969 సంవత్సరాల మధ్య కరీంనగర్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ అథారిటీ సభ్యునిగా, 1965 నుండి 1983 వరకూ మంథని వ్యవసాయాభివృద్ధి బ్యాంకు అధ్యక్షునిగా, 1980 నుండి 1985 వరకూ మహాదేవపూర్ పంచాయతీ సమితి ఉపాధ్యక్షునిగా, ధన్వాడా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షునిగా, టుబాకో బోర్డు మెంబరుగా పనిచేశారు. మంథని వ్యవసాయాభివృద్ధి బ్యాంకు అధ్యక్షునిగా నియోజకవర్గ రైతులకు బాగా దగ్గరయ్యారు.

పివి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గం కావడంతో ఆయన సిఫారసు మేరకు 1983 అసెంబ్లీ ఎన్నికల్లో రావుకు  కాంగ్రెస్ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది. అప్పుడే రాజకీయంగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించగలుగుతాడా అనే అంశంపై స్వపక్ష, విపక్షాలలో చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో తెదేపా, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిగా విచార మంచ్ పార్టీ అభ్యర్థిగా  చంద్రుపట్ల రాజి రెడ్డి దిగారు. వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు.    

1985,1989లలో సైతం శ్రీపాదరావు మంథని నుంచి ఎన్నికై హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 1983-89 మధ్యలో గ్రంథాలయ కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ మరియు అంచనాల కమిటీలలో సభ్యునిగా ఉన్నారు. చెన్నారెడ్డి సీఎంగా దిగిపోయిన తర్వాత నేదురుమల్లి జనార్దన రెడ్డి సీఎం అయిన సమయంలో సభాపతిగా ఉన్న పటోళ్ల రామచంద్రారెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో సౌమ్యుడు, వివాదాస్పదుడైన శ్రీపాదరావు స్పీకరుగా 1991,ఆగస్టు 19వ ఏకగ్రీవంగా ఎన్నికై 1995,జనవరి 11వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించారు. న్యూఢిల్లీలో 1991లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలోనూ, 1992లో జరిగిన అఖిల భారత అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలోనూ పాల్గొన్నారు. వీరి హయంలోనే 1993-94వ సంవత్సరంలో మొదటి సారిగా మహిళా శిశు సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసారు.

అసెంబ్లీ స్పీకరుగా శ్రీపాదరావు మృదు స్వభావంతో వ్యవహరించి అందరి మన్ననలను పొందారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే సార్వభౌమాధికారం ఉంటుందని, ప్రజలు ఆ అధికారాన్ని చట్టసభల సభ్యుల ద్వారా వినియోగించుకుంటారని, ప్రభుత్వ విధానాలు చట్టసభల్లో జరిగే చర్చల ద్వారానే రూపొందుతాయని, ప్రభుత్వ విధానాల తీరు తెన్నులను తెలుసుకొనే అధికారం ప్రజాప్రతినిధులకు ఉంటుందని, కనుక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం ప్రభుత్వ అధికారుల కర్తవ్యమని, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రాధాన్యతను తగ్గించివేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని వీరు 1994, మార్చి 15వ తేదీన రూలింగులో విశదం చేశారు.

ఒకవైపు స్పీకర్ పదవిని బాధ్యతతో నిర్వహిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలకు దూరం కాకుండా వారి సమస్యలను ఓపికగా పరిష్కరిస్తూ మరింత దగ్గరయ్యారు. విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు. 1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఎన్నికలు ముగిశాయి.ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు తెదేపా అభ్యర్థిపై పరాజయం పాలయ్యారు. ఓటమి పాలైన నాటి నుంచి ప్రజలకు ఏ మాత్రం దూరం కాలేదు. వారి మధ్యలోనే ఉంటూ వచ్చారు. అధికార పార్టీ ఎమ్యెల్యేపై కనీసం పల్లెత్హు మాట, విమర్శ కూడా చేయకుండా హుందాగా వ్యవహరించి ప్రజాభిమాన్ని మరింత చూరగొన్నారు.

శ్రీపాదరావు వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన అర్థాంగి పేరు జయమ్మ. భర్త నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న సమయంలో కుటుంబ బాధ్యతలను ఆమె చూసుకుంటూ వచ్చారు. వీరి కుమారుడు శ్రీధర్ బాబు సైతం రాజకీయాల్లో అడుగుపెట్టి మంథని నుంచి ఐదు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఉన్నత విద్య మరియు ఎన్నారై వ్యవహారాలు,  పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. 2023, డిసెంబర్ 7న ఏర్పడ్డ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన  ఐటీ & పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండే శ్రీధర్ బాబు సైతం మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి గడించారు.  

ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయన్ను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది. 1999 ఏప్రిల్ 13న మహాదేవపూర్ మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో కలిసి వెళ్లివస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు.

ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకుణ్ణి నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ పై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం పట్ల ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా, పరోక్షంగా వారిని  విమర్శించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన కార్యక్రమాలు రద్దు చేసుకొని హుటాహుటిన శ్రీపాదరావు మృతదేహాన్ని చూసేందుకు మంథని తరళివచ్చారు.

రాజకీయాల్లో అజాతశత్రువుగా నిలిచిన శ్రీపాదరావు గారి మృతితో కన్నీటి పర్యంతమైన మంథని ప్రాంత ప్రజలు నక్సల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన అంత్య క్రియల్లో పాల్గొన్నారు. వీరు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ భావంతో కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి వీరి పేరు పెట్టడం జరిగింది.

 ప్రతి ఏటా మార్చి 2న శ్రీపాదరావు జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని 2024 ఫిబ్రవరి 25న ఉత్తర్వులు జారీచేసింది.శ్రీపాదరావు గతించి రెండున్నర దశాబ్దాలు కావొస్తున్నా! ఇప్పటికి మంథని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
 
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com