కింగ్ ఆఫ్ ఇండియన్ కామెడీ-జస్పాల్ భట్టి

- March 04, 2025 , by Maagulf
కింగ్ ఆఫ్ ఇండియన్ కామెడీ-జస్పాల్ భట్టి

జస్పాల్ భట్టి... భారతదేశంలో అత్యంత ప్రసిద్ధుడైన దిగ్గజ హాస్య నటుడు. భారత యావనికపై స్వచ్ఛమైన హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచిన భట్టి తన కామెడీ షోల ద్వారా హాస్యప్రియులను అలరించారు.  ఫ్లాప్ షో, ఉల్టా పుల్టా మొదలైన జనరంజకమైన టి.వి. కార్యక్రమాల ద్వారా ఆయన ప్రతిభ ఖండాతరాలుకు సైతం వ్యాపించింది. నేడు కింగ్ ఆఫ్ ఇండియన్ కామెడీ జస్పాల్ భట్టి జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానం మీద ప్రత్యేక కథనం 

జస్పాల్ భట్టి 1955, మార్చి 3వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ పట్టణంలో పంజాబీ రాజపుట్ కుటుంబంలో జన్మించారు. భట్టి తన  ఇంటర్ వరకు అమృత్‌సర్‌లోనే గడిపారు. ఆ తర్వాత చండీఘర్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి  చేశారు. కొంతకాలం పంజాబ్ ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఇంజనీర్‌గా పనిచేశారు.

భట్టి చదువుకునే రోజుల నుంచే తన హాస్య చతురతతో నవ్వులను పూయించేవారు. ఇంజనీర్‌గా పనిచేస్తున్న సమయంలోనే నాటక రంగంలో సైతం క్రియాశీలకంగా ఉండేవారు. నటన మీద ఆసక్తి పెరిగిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటకాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 1989లో "ఫ్లాప్ షో" పేరుతో సమకాలీన అంశాలను కథా వస్తువుగా తీసుకోని హాస్య ప్రధానమైన సీరియల్‌ను తన స్వీయ దర్శకత్వంలో రూపొందించి డీడీ ఛానల్లో ప్రసారం చేయగా దేశవ్యాప్తంగా ఆ సీరియల్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ షోతోనే భట్టి ఇండియా అంతట ఫెమస్ అయ్యారు. ఈ షోలో భట్టితో పాటుగా నటించిన వారు తర్వాత కాలంలో ప్రముఖ నటులుగా వెలిగారు.

ఫ్లాప్ షో తర్వాత భట్టి  దూరదర్శన్ కొరకు ఉల్టాపుల్టా, నాన్సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జనబాహుళ్యమైన టి.వి.సీరియళ్లను తన స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించారు. ఇవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భట్టిని తమ సినిమాల్లో నటించమని నాటి దిగ్గజ దర్శకులు అడిగేవారు. భట్టి హాస్యప్రియత్వం, సగటు మనిషి కష్టాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై విసిరే చెణుకులు ప్రేక్షకులను టి.వి.ల ముందు కట్టిపడేసేవి. భట్టి స్ఫూర్తితోనే  ఈనాడు ఎందరో స్టాండప్ కమెడియన్లుగా రాణిస్తున్నారు.

భట్టి దేశ రాజకీయాలపై చేసిన అనేక స్టేజ్ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హవాలా కుంభకోణం సమయంలో ఆయన చేసిన "హవాలా పార్టీ" షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ కుంభకోణం తీవ్రత సగటు భారతీయుడికి బాగా అర్థమైంది. ఆ తర్వాత ప్రభుత్వాల తప్పులను తన హాస్య ఛలోక్తులతో పాలకులను సుతిమెత్తగా ఉతికారేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పాలకుల చిత్తశుద్ధి మీద ఆయన చేసిన షోల్లో సెటైరికల్ డైలాగ్స్ ఉండేవి.

భట్టి 1999లో మాహుల్ ఠీక్ హై చిత్రంతో పంజాబీ చిత్రసీమలో అడుగుపెట్టారు. పంజాబీ పోలీసులపై వ్యంగ్యాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది భట్టినే కావడం విశేషం.ఆ తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటిస్తూనే హిందీ సినిమాల్లో సైతం నటించారు. దాదాపు 40 పైగా చిత్రాల్లో నటించారు భట్టి. భట్టి హాస్య ప్రధానంగా తన స్వీయ నిర్మాణ దర్శక సారథ్యంలో పలు ఛానళ్లకు షోలు రూపొందించారు. కళారంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది.

స్వచ్చమైన హాస్య నట ప్రదర్శనతో భారత ప్రజలను దాదాపు మూడు దశాబ్దాల పాటు నవ్వించిన జస్పాల్ భట్టి 2012, అక్టోబరు 25న జలంధర్ జిల్లా షాకోట్ సమీపంలో కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై తన 57వ ఏట మరణించారు. 

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com